సాధారణ రైళ్లకు వందేభారత్‌గా పేరు మార్చి అధిక ధరలు: బెంగాల్‌ మంత్రి

7 Jan, 2023 13:18 IST|Sakshi

కోల్‌కతా: వందేభారత్‌ రైలుపై పశ్చిమ బెంగాల్‌లో రాళ్ల దాడి జరగటంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలను సమర్థించారు టీఎంసీ మంత్రి ఉదయన్‌ గుహా. రైలు టికెట్‌ ధరలు అధికంగా ఉండటమే రాళ్ల దాడికి కారణమని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం, వందేభారత్‌ రైళ్లపై విమర్శలు గుప్పించారు. సాధారణ రైళ్లకు వందేభారత్‌గా పేరు మార్చి అధిక ధరలు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. 

‘సాధారణ రైళ్లకు వందేభారత్‌గా పేరు మార్చి తిప్పుతున్నారు. హైస్పీడ్‌ ట్రైన్‌ ఛార్జీలు వసూలు చేస్తున్నారు. అది హైస్పీడ్‌ ట్రైన్‌ అయితే హౌరా నుంచి న్యూజల్పాయిగురికి చేరుకునేందుకు ఎనిమిది గంటల సమయం ఎందుకు పట్టింది? సాధారణ రైళ్లకు వందేభారత్‌గా రంగులు వేసేందుకు ప్రజల సొమ్మును వినియోగించవద్దు. తొలుత వారు వందేభారత్‌ సాధరణ రైలుగా పేరు పెట్టారు. ఆ తర్వాత బోగీలకు రంగులు వేసి వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌గా మార్చారు. టికెట్‌ ధరలు ఎక్కువగా ఉండటమే దాడులకు కారణమవుతోంది.’ అని కేంద్రపై విమర్శలు గుప్పించారు మంత్రి ఉదయన్‌ గుహా. 

హౌరా నుంచి న్యూజల్పాయిగురి మధ్య వందేభారత్‌ రైలును డిసెంబర్‌ 30, 2022న ప్రవేశపెట్టింది కేంద్రం. ప్రధాని మోదీ జెండా ఊపి రైలును ప్రారంభించారు. అయితే, దానిపై కొందరు రాళ్లదాడి చేశారు. ఆ దాడిపై మాట్లాడుతూ పాత రైలుతో పోలిస్తే కొత్త వందేభారత్‌లో ఎలాంటి తేడా లేదని, అందుకే ప్రజలు ఆగ్రహానికి గురైనట్లు పేర్కొన్నారు.

ఇదీ చదవండి: బెంగాల్‌లో తొలి వందేభారత్‌ రైలు.. జెండా ఊపి ప్రారంభించిన మోదీ..

మరిన్ని వార్తలు