‘ఈశాన్య’ ఫలితాలు నేడే

2 Mar, 2023 05:44 IST|Sakshi

త్రిపుర, నాగాలాండ్, మేఘాలయల్లో కౌంటింగ్‌

న్యూఢిల్లీ: మూడు ఈశాన్య రాష్ట్రాలు త్రిపుర, నాగాలాండ్, మేఘాలయ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు గురువారం వెలువడనున్నాయి. ఈశాన్యాన మరింతగా విస్తరించాలన్న అధికార బీజేపీ ఆశలు ఏ మేరకు నెరవేరాయన్నది ఈ ఫలితాలతో తేలనుంది. ముఖ్యంగా ఈసారి అందరి దృష్టీ ప్రధానంగా త్రిపురపైనే నెలకొంది. అక్కడ పాతికేళ్ల వామపక్ష పాలనకు తెర దించుతూ అభివృద్ధి నినాదంతో బీజేపీ 2018లో సొంతంగా అధికారంలోకి రావడం తెలిసిందే. దాంతో ఈసారి బీజేపీని ఎలాగైనా నిలువరించేందుకు చిరకాల శత్రుత్వాన్ని పక్కన పెట్టి మరీ లెఫ్ట్, కాంగ్రెస్‌ జట్టు కట్టి బరిలో దిగాయి.

ఇక నాగాలాండ్, మేఘాలయల్లో కూడా బీజేపీ అధికార సంకీర్ణంలో భాగస్వామిగా ఉంది. అయితే మేఘాలయలో ఎన్నికల ముందు అధికార నేషనల్‌ పీపుల్స్‌ పార్టీతో బంధం తెంచుకుని సంకీర్ణం నుంచి బయటికొచ్చింది. అంతేగాక తొలిసారిగా మొత్తం 60 స్థానాలకూ పోటీ చేసింది! నాగాలాండ్‌లో మరోసారి ఎన్‌డీపీపీతో కలిసి బరిలో దిగింది.

అక్కడ బీజేపీ అధికారం నిలుపుకుంటుందని, త్రిపురలో ఏకైక పెద్ద పార్టీగా మెజారిటీకి చేరువగా వస్తుందని ఎగ్జిట్‌ పోల్స్‌ పేర్కొనడం తెలిసిందే. ఇక త్రిపురలో హంగ్‌ తప్పకపోవచ్చని అంచనా వేశాయి. కొత్తగా తెరపైకి వచ్చిన టిప్రా మోతా కనీసం 15 స్థానాలకు పైగా గెలుచుకుని కింగ్‌మేకర్‌గా మారొచ్చని జోస్యం చెప్పాయి.

మరిన్ని వార్తలు