న్యాయమూర్తుల రక్షణకు భద్రతా సంస్థ ఏర్పాటు సాధ్యం కాదు 

18 Aug, 2021 04:38 IST|Sakshi

సుప్రీంకోర్టుకు తెలిపిన కేంద్రం  

పది రోజుల్లో అఫిడవిట్‌ దాఖలు చేయండి 

ధన్‌బాద్‌ న్యాయమూర్తి హత్య కేసులో రాష్ట్రాలకు సుప్రీంకోర్టు ఆదేశాలు

సాక్షి, న్యూఢిల్లీ: న్యాయమూర్తుల రక్షణకు సంబంధించి సెంట్రల్‌ ఇండస్ట్రియల్‌ సెక్యూరిటీ ఫోర్సెస్‌ (సీఐఎస్‌ఎఫ్‌) మాదిరిగా భద్రతా సంస్థ ఏర్పాటు సాధ్యం కాదని సుప్రీంకోర్టుకు కేంద్రం స్పష్టం చేసింది. ఈ అంశం సలహా ఇవ్వదగినది కాదని పేర్కొంది. ధన్‌బాద్‌ న్యాయమూర్తి హత్య కేసు సమోటో విచారణలో భాగంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ, జస్టిస్‌ సూర్యకాంత్, జస్టిస్‌ అనిరుద్ధ బోస్‌లతో కూడిన ధర్మాసనం ముందు సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా ఈ మేరకు స్పష్టం చేశారు.

న్యాయమూర్తుల భద్రతను తీవ్రంగా పరిగణించాల్సి అంశంగా తుషార్‌ మెహతా పేర్కొన్నారు. సమోటో కేసుకు సంబంధించి గత విచారణలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కౌంటరు దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించిన ఈ నెల 14న కేంద్రం కౌంటరు అఫిడవిట్‌ దాఖలు చేసింది. ‘‘న్యాయమూర్తుల భద్రతకు సంబంధించి హోంశాఖ ఇప్పటికే మార్గదర్శకాలు జారీ చేసింది. సీఐఎస్‌ఎఫ్‌ తరహాలో భద్రతా సంస్థ ఏర్పాటు సాధ్యంకాదు, సలహా ఇవ్వదగినది కాదు’’ అని అఫిడవిట్‌లో పేర్కొంది. ప్రత్యేకమైన పోలీసు వ్యవస్థ ఏర్పాటు స్థానంలో కేంద్రం జారీ చేసిన మార్గదర్శకాలు రాష్ట్రాలు అమలు చేస్తే చాలని పేర్కొంది. విచారణలో భాగంగా.. రాష్ట్రాలతో కలిసి చర్చించి దీనిపై ఓ నిర్ణయం తీసుకోవాలని తుషార్‌ మెహతాకు ధర్మాసనం సూచించింది.

హోం కార్యదర్శులతోనా, పోలీసు చీఫ్‌లతో ఎవరితో సమావేశం నిర్వహించాలని తుషార్‌ మెహతా ధర్మాసనాన్ని కోరారు. సీసీటీవీలకే సొమ్ములు లేవని రాష్ట్రాలు చెబుతున్నాయని, రాష్ట్రాలు, కేంద్రం తేల్చుకోవాల్సి అంశమని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ కేసులో  న్యాయమూర్తులు, న్యాయవాదుల భద్రతకు సంబంధించి ఎలాంటి రక్షణ తీసుకుంటున్నారో పది రోజుల్లో అఫిడవిట్‌ దాఖలు చేయాలని రాష్ట్రాలకు సుప్రీంకోర్టు ఆదేశించింది. గత విచారణ సమయంలోనే దాఖలు చేయాలని ఆదేశించిన పలు రాష్ట్రాలు అఫిడవిట్‌ దాఖలు చేయలేదని ఆయా రాష్ట్రాలు రూ.లక్ష జరిమానా సుప్రీంకోర్టు బార్‌ అసోసియేషన్‌ అడ్వొకేట్స్‌ వెల్ఫేర్‌ ఫండ్‌కు జమ చేయాలని పేర్కొంది.

మణిపూర్, జార్ఖండ్, గుజరాత్‌లు సోమవారం కౌంటరు అఫిడవిట్‌ దాఖలు చేశాయని ధర్మాసనం పేర్కొంది. ఈ నెల 14న కేంద్రం కౌంటరు దాఖలు చేసిందని తెలిపింది. కేరళ తరఫు న్యాయవాది పదిరోజులు సమయం కోరగా అనుమతించిన ధర్మాసనం మిగిలిన రాష్ట్రాలు కూడా పది రోజుల్లో దాఖలు చేయాలని, రూ.లక్ష  సుప్రీంకోర్టు బార్‌ అసోసియేన్‌ అడ్వొకేట్స్‌ వెల్ఫేర్‌ ఫండ్‌కు జమ చేయాలని స్పష్టం చేసింది. పది రోజుల్లో దాఖలు చేయకపోతే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హాజరు కావాల్సి ఉంటుందని పేర్కొంది.    

మరిన్ని వార్తలు