స్పీకర్‌ కుమార్తె ఐఏఎస్‌గా అడ్డదారిలో ఎంపిక కాలే

19 Jan, 2021 14:16 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా కుమార్తె అంజలి బిర్లా ఐఏఎస్‌గా ఎంపికవడంపై వివాదం ఏర్పడింది. సోషల్‌ మీడియాలో ఈ విషయం చర్చ కొనసాగుతోంది. అంజలి తండ్రి పదవిని అడ్డం పెట్టుకుని మెయిన్స్‌ పరీక్ష రాయకుండానే అడ్డదారిలో ఐఏఎస్‌కు ఎంపికైందని పుకార్లు వస్తున్నాయి. ఈ వివాదం రాజకీయ విమర్శలకు కూడా దారి తీస్తోంది. దొడ్డి దారిన తన కుమార్తెను ఐఏఎస్‌గా ఎంపికయ్యేలా స్పీకర్‌ ఓం బిర్లా చేశారని ఆరోపణలు వచ్చాయి. అయితే దీనిపై ఫ్యాక్ట్‌ చెక్‌ అనే సంస్థ అవన్నీ పుకార్లని స్పష్టం చేసింది. కావాల్సి వస్తే యూపీఎస్సీలో పరిశీలించవచ్చని ట్వీట్‌ చేసింది. 

ఇటీవల అంజలి బిర్లా ఐఏఎస్‌గా ఎంపికైన విషయం తెలిసిందే. అయితే ఆమె తండ్రి పదవి ద్వారా ఐఏఎస్‌గా ఎంపికైందని వస్తున్న వార్తలపై ఫ్యాక్ట్‌ చెక్‌ సంస్థ నిశితంగా పరిశీలించింది. ఈ సందర్భంగా యూపీఎస్సీ వెబ్‌సైట్‌లో అంజలి వివరాలను పరిశీలించి నిర్ధారణ చేసుకున్నట్లు ఆ సంస్థ తెలిపింది. పరీక్ష రాయకుండానే ఐఏఎస్‌గా ఎంపికైందని వస్తున్న వార్తలు అవాస్తవమని ఏఎఫ్‌పీ కొట్టిపారేసింది. ఈ సందర్భంగా వెబ్‌సైట్‌లో అంజలి బిర్లాకు వచ్చిన మార్కులను కూడా షేర్‌ చేసింది. ఓం బిర్లా కుమార్తె పరీక్షలు రాసి ఇంటర్వ్యూ ఎదుర్కొని నిష్పక్షపాతంగా ఐఏఎస్‌గా ఎంపికైందని ఆ సంస్థ వివరించింది. 

అయితే ఎంపికైన తొలి రోజు నుంచే ఈ పుకార్లు రావడంతో అంజలి బిర్లా అప్పుడే సోషల్‌ మీడియా వేదికగా బదులిచ్చింది. ఈ పుకార్లను చూసి తనకు చాలా నవ్వొస్తుందని పేర్కొంది. అత్యంత నిష్పక్షపాతంగా సివిల్స్‌ పరీక్షలు జరుగుతాయని.. లక్షలాది మంది పరీక్షలు రాస్తే కేవలం 900 మంది ఎంపికవుతారని వివరించింది. అయితే తనను కాకపోయినా యూపీఎస్సీని గౌరవించాలని విజ్ఞప్తి చేసింది. తాను రెండేళ్ల పాటు కష్టపడ్డానని.. 8 మార్కుల తేడాతో మొదటి జాబితాలో తన పేరు రాలేదని ఈ సందర్భంగా అంజలి తెలిపింది.

మరిన్ని వార్తలు