ఏ పార్టీలో చేరను: కఫీల్‌ ఖాన్‌

8 Sep, 2020 09:03 IST|Sakshi

లక్నో: ఇటీవల మథుర జైలు నుంచి విడుదలైన వైద్యుడు కఫీల్‌ ఖాన్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరతారంటూ వస్తున్న ఊహాగానాలకు తెరదించారు. తాను వైద్యుడిగానే ఉంటానని ఏ పార్టీలో చేరనని స్పష్టం చేశారు. జాతీయ భద్రతా చట్టం కింద ఆయనను అదుపులోకి తీసుకోవడాన్ని అలహాబాద్‌ హైకోర్టు తప్పుబడుతూ ఆయనను వెంటనే జైలు నుంచి విడుదల చేయాలని ఆదేశించింది. అలీగఢ్‌ ముస్లిం విశ్వవిద్యాలయంలో ఆయన చేసిన ప్రసంగం విద్వేషాలను రెచ్చగొట్టేలా లేదని ఆయనకు ఊరటనిచ్చింది. సెప్టెంబర్‌ 1న కోర్టు ఆదేశాలిచ్చినప్పటికీ ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం ఆయనను వెంటనే జైలు నుంచి విడుదల చేయకుండా జాప్యం చేసింది. దీంతో ఏదో ఒక కేసులో తనను ఇరికించేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతుందని భయమేసిందని, అయితే కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ తనకు మానవతా దృక్పథంతో సహాయం చేశారని ఆయన చెప్పారు. (పోలీసుల ఎదుటే కొట్టి చంపారు)

ఈ నేపథ్యంలో ఆయన కాంగ్రెస్‌లో చేరతారనే అంచనాలు వచ్చాయి. ప్రస్తుతం రాజస్తాన్‌లో ఉన్న కఫీల్‌ ఖాన్‌ వీటిని తోసిపుచ్చుతూ తాను ఏ పార్టీలో చేరనని చెప్పారు. బిహార్‌లో వరద బాధితులకు సాయం చేయడంపై తాను దృష్టి పెడతానన్నారు. 2017లో ఆక్సిజన్‌ సిలిండర్ల కొరతతో ఎక్కువ సంఖ్యలో చిన్నారులు మృత్యువాత పడటంతో వార్తల్లోకెక్కిన గోరఖ్‌పూర్‌లోని బీఆర్‌డీ మెడికల్‌ కాలేజీలో కఫీల్‌ఖాన్‌ వైద్యుడిగా ఉన్నారు. అప్పడు ఆయనతోపాటు మరికొంతమంది వైద్యులపై ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అయితే తర్వాత ప్రభుత్వం చేపట్టిన విచారణలో ఆయన నిర్దోషి అని తేలింది.

చదవండి: ‘2011’ పరిస్థితి పునరావృతం అవుతుందా?!

మరిన్ని వార్తలు