Corona In China: చైనాలో కరోనా వ్యాప్తికి ఒకటి కాదు.. నాలుగు వేరియంట్లు కారణం!

28 Dec, 2022 12:54 IST|Sakshi

న్యూఢిల్లీ: చైనాలో విజృంభిస్తున్న కరోనా కొత్త వేరియంట్‌ గురించి ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర కోవిడ్ ప్యానల్ చీఫ్ ఎన్ కే అరోరా వెల్లడించారు. చైనా నుంచి సరైన సమాచారం లేనందున.. ప్రజలు అప్రమత్తంగా ఉంటూ ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. చైనాలో కోవిడ్‌ వ్యాప్తికి ఒకటి కాదు నాలుగు వేరియంట్లు కారణమని పేర్కొన్నారు. డ్రాగన్‌ దేశంలో మహమ్మారి విలయానికి వైరస్‌ల కాక్టెయిల్ కారణమని స్పష్టంగా తెలుస్తోందన్నారు.

ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. బీఎఫ్‌.7 వేరియంట్‌ కేసులు కేవలం 15 శాతం మాత్రమే నమోదవుతున్నాయని.. అత్యధికంగా 50 శాతం కేసులు బీఎన్‌, బీక్యూ వేరియంట్‌ ద్వారా వ్యాపిస్తున్నాయని తెలిపారు. అదేవిధంగా ఎస్‌వీవీ వేరియంట్‌ నుంచి మరో 15 శాతం కోవిడ్‌ కేసులు నమోదవుతున్నాయన్నారు. దీంతో రోగుల్లో భిన్నమైన లక్షణాలు కనిపిస్తున్నాయని వెల్లడించారు. 

కోవిడ్‌ మొదటి, రెండు, మూడో వేవ్‌ల నుంచి వ్యాక్సిన్లు, ఇన్‌ఫెక్షన్‌ల ద్వారా భారతీయులకు హైబ్రిడ్‌ ఇమ్యూనిటీ లభించిందని తెలిపారు. దీని కారణంగా జలు భయపడాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. అయితే చైనా వాళ్లకు ఈ వేరియంట్లు వారికి కొత్తవని అన్నారు. ఇంతకుముందు ఇన్‌ఫెక్షన్‌ బారిన పడలేదన్నారు. అంతేగాక అక్కడి వ్యాక్సిన్ల ప్రభావం తక్కువగా ఉండటం, వంటి కారణాల వల్ల చైనీయుల్లో ఎక్కువ మంది మూడు, నాలుగు డోసులు తీసుకున్నారని పేర్కొన్నారు. 
చదవండి: పసలేని చైనా టీకా.. ఏమాత్రమూ లొంగని కరోనా.. తమకొద్దంటున్న దేశాలు 

చైనాతో పోల్చుకుంటే భారత్ లో 97 శాతం మంది మాత్రమే రెండు డోసులు తీసుకున్నారని ఆరోరా తెలిపారు. మిగిలిన వారు ఒకటి కంటే ఎక్కువసార్లు కోవిడ్ బారిన పడ్డారని పేర్కొన్నారు. ఇక పిల్లల విషయానికొస్తే  12 ఏళ్ల లోపు చిన్నారులు 96 శాతం మంది  ఒక్కసారి వైరస్‌ బారిన పడినట్లు చెప్పారు. వ్యాక్సినేషన్‌ జరుగుతున్న సమయంలో కూడా చాలా మందికి కోవిడ్‌ సోకిందని... వీటన్నింటిని చూస్తే మహమ్మారి నుంచి మనం చాలా సురక్షితంగా ఉన్నట్లు భావిస్తున్నామన్నారు. అయితే కేసుల విషయంలో చైనా నుంచి అస్పష్టమైన సమాచారం ఉన్నందుకున జాగ్రత్తగా ఉంటే మంచిదన్నారు. 
చదవండి: చైనాను కుదిపేస్తున్న కరోనా.. రోజుకు ఏకంగా 10 లక్షల కేసులు 

మరిన్ని వార్తలు