కారులో ప్రయాణిస్తే అది తప్పనిసరి.. నవంబర్ 1 నుంచి కొత్త రూల్‌!

14 Oct, 2022 18:25 IST|Sakshi

ముంబై: ఇకపై కారులో ప్రయాణించే వారందరు కచ్చితంగా సీటు బెల్టు పెట్టుకోవాల్సిందేనని ముంబై పోలీసులు స్పష్టం చేశారు. నవంబర్ 1 నుంచి కొత్త రూల్ అమల్లోకి వస్తుందని చెప్పారు. ఈ నిబంధనను పాటించని వారికి మోటారు వాహనాల చట్టం-2019 ప్రకారం శిక్ష విధిస్తామని హెచ్చరించారు. కారులో ముందు కూర్చున్నా, వెనకాల కూర్చున్నా సీటు బెల్టు తప్పనిసరిగా ధరించాలన్నారు. ఒకవేళ కార్లలో ప్రయాణికులందరికీ సరిపడా సీటు బెల్టులు లేకపోతే యజమానులు తక్షణమే వాటిని ఏర్పాటు చేసుకోవాలని ముంబై పోలీసులు సూచించారు. 

కార్లలో ప్రయాణికులందరికీ సీటు బెల్టు తప్పనిసరి అని కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ గత నెలలోనే ప్రకటించారు. దిగ్గజ వ్యాపారవేత్త, టాటా గ్రూప్ మాజీ ఛైర్మన్ సైరస్ మిస్త్రీ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందిన అనంతరం ఈ ప్రకటన చేశారు. కార్లలో సీటు బెల్టు నిబంధన, ట్రాఫిక్ కంట్రోల్ వ్యవస్థలో లోపాల వల్లే సైరస్ మిస్త్రీ  ప్రాణాలు కోల్పోయారని విమర్శలు వచ్చిన నేపథ్యంలో కేంద్రం వెంటనే ఈ నిర్ణయం తీసుకుంది.
చదవండి: హిమాచల్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన ఈసీ

మరిన్ని వార్తలు