ప్రముఖ సామాజిక కార్యకర్త మృతి, సీఎం ఠాక్రే సంతాపం

25 Aug, 2021 19:30 IST|Sakshi

సాక్షి,ముంబై: సామాజిక కార్య‌క‌ర్త‌, ప‌రిశోధ‌కురాలు, ర‌చ‌యిత డాక్ట‌ర్ గెయిల్ ఓంవేద్(81)క‌న్నుమూశారు. సుదీర్ఘ అనారోగ్యంతో ఆమె బుధవారం కన్నుమూశారని భ‌ర్త‌, కార్య‌క‌ర్త భార‌త్ ప‌టాంక‌ర్‌ ప్రకటించారు. గెయిల్‌ అస్తమయంపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే సంతాపం తెలిపారు. వివిధ సామాజిక ఉద్యమాలు, జానపద సంప్రదాయాలు, మహిళల హక్కులపై ఆమె చేసిన కృషి మరువలేనివని ఠాక్రే నివాళులర్పించారు.

అటు పలువురు దళిత, మహిళా ఉద్యమకారులు, ఇతర సాహితీవేత్తలు  కూడా గెయిల్‌ మరణంపై  విచారం వ్యక్తం చేశారు. చరిత్రకారుడు రామచంద్ర గుహ, సీపీఎం నేత సీతారాం ఏచూరి, ఎన్‌సిపి అధ్యక్షుడు శరద్ పవార్ కూడా ఆమెకు నివాళులర్పించారు. రాష్ట్రంలో వామపక్ష ఉద్యమానికి ఎంతో సహాయపడ్డారని సీపీఎం నేత అజిత్ అభ్యంకర్ అన్నారు. అమెరికాలో జన్మించిన గెయిల్‌ అంబేద్క‌ర్‌-పూలే ఉద్య‌మంపై పీహెచ్‌డీ చేసేందుకు ఇండియాకు వ‌చ్చారు. భార‌తీయ పౌరురాలిగా మారి సామాజిక కార్య‌క‌ర్త భ‌ర‌త్ ప‌టాంక‌ర్‌ను పెళ్లి చేసుకున్నారు. దళిత రాజకీయాలు, మహిళా పోరాటాలు, కుల వ్యతిరేక ఉద్యమంపై అనే పుస్తకాలు రచించారు. ముఖ్యంగా శ్రామిక్ ముక్తీ ద‌ళ్ ఏర్పాటు, కుల వ్య‌తిరేక ఉద్య‌మంలో విశేష పాత్ర  పోషించారు. అలాగే ప‌ర్యావ‌ర‌ణ స‌మ‌స్య‌ల‌పైన కూడా రచనలు చేశారు. 

కాగా 1941, ఆగ‌స్టు 2వ తేదీన అమెరికాలోని మిన్న‌సోటా రాష్ట్రంలోని మినియాపోలిస్‌లో గెయిల్ జ‌న్మించారు. 1963-64 కాలంలో ఇండియాను సందర్శించిన ఆమె ద‌ళిత‌, కుల వ్య‌తిరేక ఉద్య‌మాల ఆమె ఆక‌ర్షితురాల‌య్యారు. అలా పీహెచ్‌డీ నిమిత్తం  1970-71లో ఇండియాకు వ‌చ్చారు. 1976లో భ‌ర‌త్ ప‌టాంక‌ర్‌ను ఆమె పెళ్లి చేసుకున్నారు. 1983లో భార‌తీయ పౌర‌స‌త్వం సాధించారు. అప్పటినుంచి సతారా జిల్లాలోని కాసేగావ్‌లో నివాసముంటున్నారు.


భర్తతో గెయిల్ (ఫైల్‌ ఫోటో)

భర్తతో కలిసి శ్రామిక్ ముక్తి దళ్‌ను స్థాపించి అక్కడి మహిళల అభ్యున్నతికి కృషి చేశారు. మ‌హారాష్ట్ర‌లోని గ్రామీణ ప్రాంతాల ప్రజల అభివృద్ధి, కొంక‌ణ్ ప్రాంతంలో నీటి హ‌క్కుల కోసం సాగిన ఉద్య‌మంలో కీలక పాత్ర పోషించారు. అలాగే సావిత్రిబాయి ఫూలే పూణే విశ్వవిద్యాలయం, నార్డిక్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఏషియన్ స్టడీస్, ఇందిరాగాంధీ ఓపెన్ యూనివర్సిటీల బోర్డ్‌లో సభ్యురాలిగా ఉన్నారు. ఇటీవలి సంవత్సరాలలో యునైటెడ్  నేషన్స్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్‌తో వివిధ సమస్యలపై సలహాదారుగా కూడా గెయిల్‌ పనిచేయడం విశేషం. 

మరిన్ని వార్తలు