బ్యాంకు ఖాతాదారులకు గుడ్ న్యూస్

4 Jun, 2021 17:13 IST|Sakshi

బ్యాంకు ఖాతాదారులకు ఆర్‌బీఐ శుభవార్త అందించింది. ఇక నుంచి జీతాలు, పెన్షన్ చెల్లింపుల కోసం ఎదురుచూడాల్సిన అవసరం లేదు. బ్యాంకు సెలవులతో సంబంధం లేకుండా ఒకటవ తేదీన అన్నీ సెటిల్ అయిపోతాయి. ఇప్పటివరకు ఈ పద్ధతి లేదు. ఒకటవ తేదీన బ్యాంకులకు సెలవు ఉంటే జీతాలు, పెన్షన్ కోసం తర్వాత రోజు వరకు ఎదురుచూడాల్సిన పరిస్థితి ఉండేది. ఆగస్ట్ 1 నుంచి ఈ కొత్త మార్పులు అమల్లోకి రానున్నట్లు ఆర్‌బీఐ ప్రకటించింది. ఇకపై జీతాలు, పెన్షన్, వడ్డీ, ఈఎంఐలు, టెలిఫోన్ బిల్లులు, గ్యాస్ బిల్లులు, సిస్టమెటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ లాంటివన్నీ ఒకటో తేదీన జమ/కట్ కావడం జరుగుతుంది. 

ఇక వీటికి బ్యాంకు సెలవులతో ఎటువంటి సంబంధం లేదు. ఆగస్ట్ 1 నుంచి నేషనల్ ఆటోమేటెడ్ క్లియరింగ్ హౌజ్ సేవలు బ్యాంకు సెలవు రోజుల్లో కూడా అందుబాటులో ఉంటాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. ఖాతాదారుల ఖాతాలో జమకావాల్సిన జీతాలు, పెన్షన్, డివిడెండ్, వడ్డీ లాంటివన్నీ సెలవులతో సంబంధం లేకుండా ప్రాసెస్ జరుగుతాయి. అలాగే ఖాతాదారులు చెల్లించాల్సిన లోన్ ఈఎంఐ, ఎలక్ట్రిసిటీ బిల్, టెలిఫోన్ బిల్, మ్యూచువల్ ఫండ్స్, ఇన్స్యూరెన్స్ ప్రీమియం లాంటివి కూడా సెలవుల రోజుతో సంబంధం లేకుండా కట్ అవుతాయి. అలాగే, కరోనా మహమ్మారి విలయం కారణంగా రిజర్వ్‌ బ్యాంకు కీలక వడ్డీ రేట్ల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతానికి ఆర్‌బీఐ కీలక వడ్డీరేట్లు యథాతథంగానే ఉంచింది. దీని ప్రకారం రెపో రేటు 4 శాతం వద్ద, రివర్స్‌ రెపో రేటు 3.35 శాతంగా ఉండనుంది. గవర్నర్ శక్తికాంత దాస్‌ నేతృత్వంలో పాలసీ కమిటీ మూడు రోజుల సమావేశంలో ఏకగ్రీవంగా ఈ నిర్ణయం తీసుకుంది.

చదవండి: మీ ఆధార్ నెంబర్ ఏ బ్యాంక్ ఖాతాకు లింక్ చేశారో తెలుసుకోండిలా?

>
మరిన్ని వార్తలు