మీ పేరుతో ఎవరైనా సిమ్ తీసుకున్నారో తెలుసుకోండిలా?

20 Apr, 2021 14:57 IST|Sakshi

మనకు తెలియకుండానే మన పేరు మీద ఎన్ని ఫోన్‌ నంబర్లున్నాయో మీకు తెలుసా?. ఇలా మనకు తెలియకుండానే కొందరి పేరు మీద సైబర్ నెరగాళ్లు సిమ్ లు తీసుకుంటు న్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఈ సిమ్ ద్వారా అనైతిక, అసాంఘిక కార్యక్రమాలకు ఈ మొబైల్ నెంబర్ వాడుతున్నట్లు చాలా కేసులలో బయటపడింది. ఇలా మీకు తెలియకుండా ఇతరులు సిమ్ తీసుకోవడంతో మీరు మీకు సంబంధం లేని కేసులలో చిక్కుకునే ప్రమాదం చాలా ఎక్కువ. 

ఇలా మన పేరు మీద లేదా మన వివరాలతో ఎవరైనా మొబైల్ నెంబర్ తీసుకుంటే వాటిని బ్లాక్ చేసే సదుపాయం ఇప్పడు మీకు కల్పిస్తున్నారు. దీని కోసం మీరు విజయవాడ టెలికాం విభాగం(డీవోటీ) రూపొందించిన వెబ్‌సైట్‌(https://tafcop.dgtelecom.gov.in)ను సందర్శించాలి. వెబ్‌సైట్‌ ఓపెన్ చేశాక అందులో మీరు ప్రస్తుతం వాడుతున్న మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మీరు ఇచ్చిన మొబైల్ నెంబర్ ఒక ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేయగానే మన పేరు మీద ఉన్న ఫోన్‌ నంబర్ల వివరాలన్నీ వస్తాయి. వాటిలో మనకు అవసరం లేనివి, మనకు తెలియకుండా మన పేరుమీద ఉన్న వాటిని సెలక్ట్‌ చేసి రిపోర్ట్ చేస్తే టెలికం శాఖ తగు చర్యలు తీసుకుంటుంది. 

ఒకరి పేరు మీద అత్యధికంగా 9 నంబర్లు మాత్రమే ఉండేందుకు వీలుంది అని విజయవాడ టెలికం శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌ రాబర్ట్‌ రవి పేర్కొన్నారు. కొందరి పేర్ల మీద అంతకంటే ఎక్కువ నంబర్లు ఉన్నాయని తమ దృష్టికి వచ్చిందని. అందుకే, ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు ఈ పోర్టల్‌ను ప్రారంభించామన్నారు. దీనివల్ల అనధికారికంగా వినియోగిస్తున్న నంబర్లకు చెక్‌ పెట్టే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. ముందుగా తెలుగు రాష్ట్రాల టెలికం సర్కిళ్లలో ఈ సదుపాయాన్ని ప్రారంభించామని. త్వరలో దేశ వ్యాప్తంగా అందుబాటులోనికి వస్తుందన్నారు. ఎవరికైనా అనుమానం వెంటనే ఇలా చెక్ చేసుకోవాలని తెలిపారు.

చదవండి: సింగిల్ చార్జ్ తో 100 కి.మీ ప్రయాణించే సైకిల్

మరిన్ని వార్తలు