ముప్పు ఉంటే భారత్‌ యుద్ధం చేస్తుంది!

27 Oct, 2020 03:38 IST|Sakshi

ఎన్‌ఎస్‌ఏ అజిత్‌ ధోవల్‌ వ్యాఖ్య

నానుద్దేశించి కాదన్న అధికారులు

న్యూఢిల్లీ:  జాతీయ భద్రత సలహాదారు అజిత్‌ ధోవల్‌ అక్టోబర్‌ 24న రిషికేష్‌లో చేసిన వ్యాఖ్యలు ఏ దేశాన్నో లేక ఏ పరిస్థితినో ఉద్దేశించిన చేసినవి కావని అధికారులు సోమవారం వివరణ ఇచ్చారు. అవి రిషికేష్‌లో జరిగిన ఒక ఆధ్యాత్మిక కార్యక్రమంలో భారతదేశ నాగరికత గురించి ఆధ్యాత్మిక ఉద్దేశంతో చేసిన వ్యాఖ్యలు అని వివరించారు. రిషికేష్‌లోని పారమార్ధ నికేతన్‌ ఆశ్రమంలో శనివారం జరిగిన ఒక కార్యక్రమంలో ధోవల్‌ పాల్గొన్నారు. అక్కడ భక్తులను ఉద్దేశించి భారతదేశ ఆధ్యాత్మిక శక్తిని గురించి ప్రసంగించారు. స్వామి వివేకానంద బోధనలను ప్రస్తావించారు. ‘భారతదేశం ఇప్పటివరకు ఎవరిపైనా దాడి చేయలేదు. దీని గురించి భిన్నాభిప్రాయాలున్నాయి.

అయితే, దేశానికి ముప్పు ఉందని భావిస్తే.. కచ్చితంగా భారత్‌ దాడి చేస్తుంది. ఎందుకంటే దేశాన్ని రక్షించడం చాలా ముఖ్యమైన విషయం. ప్రమాదం ఉందని భావిస్తే పోరాటం చేస్తుంది. వ్యక్తిగత, స్వార్థ ప్రయోజనాల కోసం కాకుండా, విస్తృత ప్రయోజనాలు లక్ష్యంగా ఆ పోరాటం ఉంటుంది. మన భూభాగంపై కానీ, ఇతరుల భూభాగంపై కానీ భారత్‌ పోరాడుతుంది. కానీ, అది స్వార్థ ప్రయోజనాల కోసం మాత్రం కాదు.. విస్తృత ప్రయోజనాలు కేంద్రంగానే యుద్ధం చేస్తుంది’ అని ధోవల్‌ పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై మీడియాలో పలు కథనాలు వెలువడ్డాయి. తూర్పు లద్ధాఖ్‌లో సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో చైనాను ఉద్దేశించే ధోవల్‌ ఆ వ్యాఖ్యలు చేశారని పేర్కొన్నాయి. దాంతో, అధికారులు ధోవల్‌ వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. 

మరిన్ని వార్తలు