సరిహద్దు ఉద్రిక్తత.. దోవల్‌ సమీక్ష

1 Sep, 2020 14:14 IST|Sakshi

న్యూఢిల్లీ: భారత్‌-చైనా సరిహద్దుల మధ్య తలెత్తిన ఉద్రిక్తతల నేపథ్యంలో మంగళవారం జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌ ఉన్నతాధికారులతో సమవేశమయ్యి.. పరిస్థితులను సమీక్షించారు. అనంతరం కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ వీరితో భేటీ కానున్నారు. ఆగస్టు 29న ఎల్‌ఏసీ వెంబడి యథాతథ స్థితిని మార్చడానికి గాను 150-200 మంది చైనా సైనికులు ప్రయత్నించినట్లు భారత సైన్యం గుర్తించింది. వెంటనే రంగంలోకి దిగిన ఇండియన్‌ దళాలు.. డ్రాగన్‌ చర్యలను తిప్పికొట్టిన సంగతి తెలిసిందే. ఉద్రిక్తతలను తగ్గించే క్రమంలో ప్రస్తుతం చుషుల్‌ వద్ద బ్రిగేడ్‌ కమాండర్‌ స్థాయిలో ఇరు వర్గాల మధ్య చర్చలు జరుగుతున్నాయి.(చదవండి: చైనా కుట్ర: దోవల్‌ ఆనాడే హెచ్చరించినా..)

ఈ నేపథ్యంలో దేశ సమగ్రత, సార్వభౌమత్వాన్ని కాపాడుకుంటూనే చర్చల ద్వారా సరిహద్దుల్లో నెలకొన్న ప్రతిష్టంభనకు ముగింపు పలికే ప్రయత్నాలు జరుగుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే. భారత్‌, చైనా మధ్య ఈ ఏడాది ఏప్రిల్‌, మే నుంచి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చైనా ఆర్మీ భారత్‌కు చెందిన ప్యాంగ్‌యాంగ్ త్సో‌, ఫింగర్‌ ఏరియా, గల్వాన్‌ వ్యాలీ, హాట్‌ స్ప్రింగ్స్‌, కొగ్రుంగ్‌ నాలా ప్రాంతాల్లోకి వచ్చాయి. 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు