నయా అణుకేంద్రం ‘నాట్రియం’

10 Mar, 2021 01:51 IST|Sakshi

ముప్పై కోట్ల నుంచి.. మూడు వందల కోట్లు..
భూమి ఉష్ణోగ్రత రెండు డిగ్రీల సెల్సియస్‌ పెరిగితే
వచ్చే వాతావరణ మార్పుల ప్రభావం వల్ల మరణించే వారి సంఖ్య ఇది! 
బొగ్గు, చమురు ఉత్పత్తుల వాడకం వల్ల కార్బన ఉద్గారాలు పెరిగి ఉష్ణోగ్రతలు మండిపోతున్నాయి.. 
వాటిని తగ్గించి, కాలుష్యం లేని విద్యుత్‌ ఉత్పత్తి కోసం అంతర్జాతీయంగా
చాలా ప్రయత్నాలే జరుగుతున్నాయి
నాట్రియం కూడా అలాంటిదే.. ఇదేంటి కొత్త అనుకుంటున్నారా? 
చాలా సింపుల్‌ మనం నిత్యం వాడే ఉప్పులో ఉండే సోడియం. 
సోడియంతో అణుశక్తి రంగంలో సరికొత్త విప్లవాన్ని సృష్టించే ప్రయత్నమే ‘నాట్రియం’ ప్రాజెక్టు

సాక్షి హైదరాబాద్‌: బొగ్గు, చమురు వాడకంతో భూవాతావరణంలో పేరుకుపోతున్న విష వాయువులను తగ్గించాలన్నది అందరి ప్రయత్నం. కాలుష్యం లేని విద్యుత్‌ ఉత్పత్తి చేయాలన్నది లక్ష్యం. సౌర, పవన, జియో థర్మల్, తరంగ శక్తి వంటి అన్నిరకాల సంప్రదాయేతర ఇంధన వనరులను ఉయోగించినా అది సాకారం కావాలంటే ఏండ్లకేండ్లు పడతాయి. పైగా వీటి వాడకంలో బోలెడన్ని చిక్కులూ ఉన్నాయి. ఈ క్రమంలోనే ‘నాట్రియం’ తెరపైకి వచ్చింది. ఓవైపు వాతావరణంలోని కార్బన్‌డయాక్సైడ్‌ను తగ్గిస్తూనే.. మరోవైపు నిరంతరం విద్యుత్తు ఉత్పత్తి చేసేందుకు నాట్రియం ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఈ దిశగానే మైక్రోసాఫ్ట్‌ అధినేత బిల్‌గేట్స్‌కు చెందిన టెరాపవర్, అంతర్జాతీయ సంస్థలు జనరల్‌ ఎలక్ట్రిక్, హిటాచీ, అమెరికా ప్రభుత్వ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఎనర్జీ కలిసి.. సోడియం ఆధారిత అణు విద్యుత్‌ కేంద్రాలను అభివృద్ధి చేస్తున్నారు. సాంకేతికత పరంగా నాలుగో తరంగా చెప్పుకుంటున్న ఈ అత్యాధునిక న్యూక్లియర్‌ రియాక్టర్‌ తయారీ వెనుక దశాబ్దాల శ్రమ దాగి ఉంది. అమెరికాలోని ఓ రహస్య ప్రాంతంలో ఈ నమూనా అణు విద్యుత్‌ కేంద్రం నిర్మాణం పూర్తయింది కూడా. అన్నీ సవ్యంగా సాగితే.. మరికొన్ని నెలల్లోనే దాని నుంచి 345 మెగావాట్ల విద్యుత్తు అమెరికాకు అందనుంది.

చవక, భద్రత కూడా..
నాట్రియం అణువిద్యుత్‌ కేంద్రాల వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అణువిద్యుత్‌ అనగానే రేడియేషన్‌ భయం మొదలవుతుంది. అయితే బొగ్గు, చమురు వంటి సంప్రదాయ ఇంధనాలతో జరిగే విద్యుదుత్పత్తిలో ప్రతి టెరావాట్‌ ఉత్పత్తికి 24.6.. 18.1 చొప్పున మరణాలు సంభవిస్తోంటే.. అణువిద్యుత్‌ కారణంగా జరుగుతున్న మరణాలు 0.07 మాత్రమేనని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఇన్నేండ్ల అణువిద్యుత్‌ ఉత్పత్తి చరిత్రలో చెర్నోబిల్, ఫుకుషిమా వంటి రెండు ప్రమాదాలు మాత్రమే జరగాయని గుర్తు చేస్తున్నారు. అయితే నాట్రియం డిజైన్‌లో హైడ్రోజన్, ఆక్సిజన్‌ ఉత్పత్తి అసలే లేనందున ఫుకుషిమా వంటి సంఘటనలు జరిగే అవకాశమే ఉండదని చెబుతున్నారు.

వంద శాతం ఉత్పత్తి 
నాట్రియం డిజైన్‌లోని అణువిద్యుత్‌ కేంద్రాలు పూర్తి ఉత్పత్తి సామర్థ్యంతో పనిచేస్తాయి. అదికూడా రోజంతా. ఈ ఏడాది అమెరికాలో ప్రారంభం కానున్న నాట్రియం అణువిద్యుత్‌ కేంద్రం సామర్థ్యం 345 మెగావాట్లు. ఎండాకాలంలోగానీ, ఎప్పుడైనా అత్యవసర పరిస్థితుల్లోగానీ అకస్మాత్తుగా విద్యుత్‌కు డిమాండ్‌ పెరిగితే.. నాట్రియం అణువిద్యుత్‌ కేంద్రాల నుంచి ఆరేడు గంటల పాటు ఏకంగా 550 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి చేయవచ్చు. ఒక్కో నాట్రియం అణువిద్యుత్‌ కేంద్రం ద్వారా సుమారు 2.25 లక్షల ఇండ్లకు నిరంతర విద్యుత్‌ సరఫరా చేయవచ్చునని నిపుణులు అంచనా వేశారు. నాట్రియం విజయవంతమైతే అతితక్కువ స్థలంలోనే ఈ కొత్త తరహా అణువిద్యుత్‌ కేంద్రాలను ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా ఏర్పాటు చేసుకోవచ్చునని అంటున్నారు.

నీటికి బదులు ఉప్పు!
నాట్రియంకు, సంప్రదాయ అణువిద్యుత్‌ కేంద్రాలకు మధ్య ఉన్న ప్రధానమైన తేడా ఉప్పు వాడకమే. యురేనియం అణువులను న్యూట్రాన్లతో ఢీకొట్టించడం ద్వారా పుట్టే శక్తితో నీటిని ఆవిరిగా మార్చడం, ఆ ఆవిరి సాయంతో టర్బయిన్లను తిప్పి విద్యుదుత్పత్తి చేయడం సంప్రదాయ అణువిద్యుత్‌ కేంద్రాల్లో జరిగే ప్రక్రియ. నాట్రియంలోనూ ఇదే తరహాలో జరుగుతుంది. కానీ నీటికి బదులు ఉప్పును ఉపయోగిస్తారు. ఇక నీరు వంద డిగ్రీల సెల్సియస్‌లో ఆవిరిగా మారితే.. ఉప్పు 500 డిగ్రీల ఉష్ణోగ్రతలో ఆవిరిగా మారుతుంది. పైగా నీళ్లు వేడయ్యాక హైడ్రోజన్, ఆక్సిజన్‌లుగా విడిపోయినట్టు ఉప్పు విడిపోదు. ఐదురెట్లు ఎక్కువ వేడిని నిల్వ చేసుకున్న ఉప్పును రియాక్టర్‌కు దూరంగా తీసుకెళ్లి నిల్వ చేయడం, అవసరానికి తగ్గట్టు నీటిని వేడి చేసి విద్యుత్‌ను ఉత్పత్తి చేసుకోవడం ‘నాట్రియం’ అణు విద్యుత్తు కేంద్రాల డిజైన్‌లోని ప్రధాన విశేషం. 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు