Nupur Sharma: నూపుర్‌ శర్మ అంతుచూస్తాం.. బెదిరింపులతో అ‍ప్రమత్తమైన పోలీసులు

7 Jun, 2022 15:18 IST|Sakshi

ముహమ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యలు చేసిన బీజేపీ మాజీ నేత నూపుర్‌ శర్మపై.. విమర్శలు ఏమాత్రం తగ్గడం లేదు. సరికదా బెదిరింపులు వస్తున్నాయి. తాజాగా ఉగ్రవాద సంస్థ ముజాహుద్దీన్‌ గజ్‌వాతుల్‌ హింద్‌ హెచ్చరికలు జారీ చేసింది.  

ఢిల్లీ: ఉగ్ర సంస్థ ఎంజీహెచ్‌ తాజాగా నూపుర్‌ శర్మకు తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది.  ముహమ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యల చేసినందుకుగానూ బేషరతుగా ప్రపంచానికి క్షమాపణ చెప్పాలని ఒక బెదిరింపు ప్రకటన విడుదల చేసింది ఆ ఉగ్ర సంస్థ.

‘‘నూపుర్‌ శర్మ తన ప్రకటనను వెనక్కి తీసుకోవాలి. మొత్తం ప్రపంచానికి క్షమాపణలు చెప్పాలి. లేకుంటే.. ప్రవక్తను అగౌరవపరిచినందుకు ఏం చేయాలో అది చేస్తాం’’ అంటూ  టెలిగ్రామ్‌లో ఒక ప్రకటన విడుదల చేసింది ఎంజీహెచ్‌. నూపుర్‌ శర్మ తొలుత అవమానించింది. ఆ తర్వాత క్షమాపణలు చెబుతోంది. ఇదంతా బీజేపీ చేస్తున్న మాయాజాలం. చాణక్యనీతిని ప్రయోగిస్తూ ప్రజలను బుట్టలో వేసుకుంటోంది. ద్వంద్వ విధానాన్ని అవలంభిస్తోంది. బీజేపీ నేతలు క్రమం తప్పకుండా ఇస్లాం వ్యతిరేక ప్రకటనలు ఇస్తున్నారు. ఆరెస్సెస్‌, రామ్‌ సేన, భజరంగ్‌ దళ్‌, శివ సేనలు.. వరుసగా ఇస్లాం, ముస్లింలకు వ్యతిరేకంగా ప్రసంగలు చేస్తున్నాయి అంటూ ఆ టెలిగ్రామ్‌ ప్రకటనలో ఉంది. 

కశ్మీర్‌లో క్రియాశీలకంగా వ్యవహరించే ఈ ఉగ్రసంస్థ.. ఈ ఏడాది జనవరిలో ఢిల్లీ ఘాజీపూర్‌ పూల మార్కెట్‌లో ఐఈడీ పేలుడుకు పాల్పడింది.

గట్టి భద్రత 
ఇదిలా ఉంటేనూపుర్‌ శర్మకు, ఆమె కుటుంబానికి గట్టి భద్రత కల్పించారు ఢిల్లీ పోలీసులు. వ్యాఖ్యల తర్వాత ఎదురువుతున్న వేధింపులు, బెదిరింపులపై ఆమెను పోలీసులను ఆశ్రయించారు. దీంతో పోలీసులు స్పందించారు. 

ఇదిలా ఉంటే.. బీజేపీ ఈ వ్యవహారానికి వీలైనంత దూరంగా ఉండాలని ప్రయత్నిస్తోంది. అందుకే నూపుర్‌ మీద తక్షణ చర్యల కింద పార్టీ నుంచి బహిష్కరించింది. ఆ వెంటనే ఆమె క్షమాపణలు తెలియజేశారు కూడా. అయితే.. అప్పటికే ఇస్లాం దేశాలు సదరు వ్యాఖ్యలపై తీవ్ర ఖండన మొదలుపెట్టాయి. భారత్‌లోని కేంద్ర ప్రభుత్వాన్ని, అధికార పక్ష నేతల ఇస్లాం వ్యతిరేక విధానాలపై ప్రశ్నలు గుప్పిస్తున్నాయి.

చదవండి: భారతీయ ఉత్పత్తులు మాకొద్దు!

>
మరిన్ని వార్తలు