అయినవారు అపరిచితులు.. ఆ నలుగురే శ్మశాన బంధువులు

7 Jul, 2021 14:51 IST|Sakshi

భువనేశ్వర్‌: కరోనా భయంతో అయిన వారంతా అపరిచితులుగా మారారు. ఆత్మీయత, మమతానురాగాల్ని కరోనా సమాధి చేసింది. కోవిడ్‌ చికిత్స పొందుతూ కన్నుమూసిన వారి మృతదేహాల చెంతకు కుటుంబసభ్యులు సైతం రావడంలేదు. అంత్యక్రియలకు వెళితే, తమ ప్రాణాలకు అంతిమయాత్ర మొదలైనట్లేనన్న భావనతో మృతదేహాల్ని అనాథలుగా విడిచి పెట్టేస్తున్నారు. సంస్కారవంతంగా మృతదేహాల్ని కడతేర్చాల్సిన సభ్యసమాజం కరోనా వైపరీత్యంతో అమానుషంగా వ్యవహరించేందుకు ఏమాత్రం వెనుకంజ వేయడం లేదు. 

అంత్యక్రియలకు దూరమైన వారు అస్తికల నిమజ్జనం వంటి మోక్ష ప్రాప్తి కార్యకలాపాల్ని కూడా నిరాకరిస్తున్నారు. కరోనా మలివిడత సంక్రమణ ఇటువంటి విచారకర పరిస్థితుల్ని ఆవిష్కరించింది. సుందరగడ్‌ ప్రాంతంలో కరోనా బలిగొన్న వారిలో 400 మృతదేహాలు అనాథశవాలుగా మిగిలిపోయాయి. శ్మశాన్‌ బంధు కార్యకర్తలు ఈ మృతదేహాలకు అంతిమ సంస్కారాలు నిర్వహించారు. అస్తికలల భస్మం తీసుకెళ్లేందుకు కూడ 76 మంది నిరాకరించారు. మీడియాలో ప్రసారం కావడంతో 38 మంది కోవిడ్‌ అనాథశవాలకు చెందిన బంధువర్గం స్పందించారు. సంబంధిత మృతుల భస్మ కలశాల్ని తీసుకెళ్లగా, మిగిలిన 38 మంది అభాగ్యుల భస్మ కలశాలు శ్మశాన్‌ బంధు కార్యకర్తల అధీనంలో ఉండిపోయాయి. వీరి భస్మం పుణ్యనదుల్లో నిమజ్జనం చేసేందుకు శ్మశాన్‌ బంధువర్గం నడుం బిగించింది.  

సామూహిక నిమజ్జనం 
సుందరగడ్‌ రాణీ బగీచా శ్మశాన వాటికలో అయిన వారు నిరాకరించిన మృతుల ఆత్మ మోక్షానికి సామూహిక నిమజ్జనం కార్యక్రమం చేపట్టారు. శాస్త్రీయ రీతుల్లో మంత్రోచ్ఛరణ నడుమ 38 మంది దివంగతుల హస్త భస్మ కలశాలకు పూజాదులు చేపట్టి త్రివేణి సంగమంలో నిమజ్జనం చేసేందుకు అలహబాద్‌ (ప్రయాగ) బయల్దేరారు. ఈ నెల 3న త్రివేణి సంగమంలో సామూహికంగా హస్తికల్ని నిమజ్జనం చేస్తారు.  

శ్మశాన బంధువర్గం 
సిద్ధాంత పండా, మనోజ్‌ త్రిపాఠి, శిశిర్‌ బెహరా, కమలేష్‌ నథాని ఈ నలుగురు శ్మశాన బంధువర్గంగా ఆవిర్భవించారు. ఆ నలుగురు వందలాది కరోనా మృతులకు అంత్యక్రియలు నిర్వహించి మానవీయ విలువల పరిరక్షణకు పట్టంకట్టారు. కరోనా మలివిడత విజృంభణ పురస్కరించుకుని ఈ ఏడాది ఏప్రిల్‌ నెల 14 నుంచి జూన్‌ ఆఖరు వరకు సుందరగడ్‌ ప్రాంతంలో 282 కోవిడ్‌ మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించారు. 76 మంది కోవిడ్‌ మృతుల బంధువర్గాలు కరోనా సంక్రమణ భయంతో ఆస్పత్రి లేదా శ్మశానవాటికలో విడిచి అపరిచితులుగా దూరం అయ్యారు. ఫోనుద్వారా సంప్రదించడంతో సగం మంది స్పందించగా మిగిలిన సగంమంది ఆత్మశాంతికి హిందూ ధర్మం ప్రకారం అస్తికల భస్మం కార్యక్రమం కూడ ముగించారు.
 

మరిన్ని వార్తలు