పింఛన్‌ ఇవ్వాలని నిర్ణయం: 24 నుంచి ఆరోగ్య సర్వే 

18 May, 2021 10:02 IST|Sakshi

24 నుంచి ఇంటింటా ఆరోగ్య సర్వే

కోవిడ్‌ మృతుల కుటుంబీకులకు పెన్షన్‌

ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ నిర్ణయం

భువనేశ్వర్‌: కరోనా విజృంభణను సమర్థవంతంగా ఎదుర్కోవడమే లక్ష్యంగా అఖిల పక్ష భేటీ సోమవారం జరిగింది. కోవిడ్‌–19 నియంత్రణ, టీకాల పంపిణీ, ఆస్పత్రుల్లో వైద్య సదుపాయాలపై అఖిల పక్ష సభ్యుల అభిప్రాయాలు, సలహాలు, సంప్రదింపుల శీర్షికతో సాగిన ఈ సమావేశంలో జాతీయ స్థాయిలో రాష్ట్రంలోని కరోనా స్థితిగతులను సభ్యులు వివరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌  మాట్లాడుతూ కరోనా నియంత్రణకు అందరూ సమష్టిగా కృషి చేయాలని కోరారు.

రాష్ట్రంలో కరోనాపై పోరులో ఇప్పటివరకు అధికార యంత్రాంగాలు కనబరిచిన పనితీరు అభినందనీయమన్నారు. ఈ నెల 24వ తేదీ నుంచి కరోనా కొత్త లక్షణాల కోసం ఇంటింటా ఆరోగ్య సర్వే నిర్వహించి, బాధితుల గుర్తింపు జరుగుతుందన్నారు. కోవిడ్‌ కార్యకలాపాల నిర్వహణకు త్వరలో ప్రతీ గ్రామంలోని కల్యాణ సమితికి రూ.10 వేలు, హోమ్‌ ఐసొలేషన్‌లోని రోగుల బాగోగులను పర్యవేక్షించే ఆశా కార్యకర్తలకు ద్విచక్ర వాహనం, చెప్పులు, గొడుగు, టార్చి, ఇతరాత్ర ఉపకరణాలతో  రూ.10 వేల ఆర్థిసాయం మంజూరు చేస్తున్నట్లు సీఎం తెలిపారు. వీటితో పాటు కరోనాతో భర్తలను కోల్పోయిన వితంతువులు, తల్లిదండ్రులకు మధుబాబు పెన్షన్‌ మంజూరు చేస్తామని ప్రకటించారు. అలాగే గ్రామీణ ప్రాంతాల్లోని కరోనా తీవ్రత దృష్ట్యా లాక్‌డౌన్‌పై సర్పంచ్‌లే నిర్ణయం తీసుకుంటారని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు