BJD MLA: వయసు 58.. పదో తరగతి పరీక్షలు రాసిన అధికార పార్టీ ఎమ్మెల్యే

30 Apr, 2022 07:45 IST|Sakshi

దేశంలో పెద్దగా చదువుకోని రాజకీయ నేతలు ఉన్నారు. అయినా రాజకీయాలకు క్వాలిఫికేషన్‌లు అవసరమా? అనుకుంటారు చాలామంది. కానీ, జ్ఞానం పెంచుకోవడానికి ఏ వయసు అయితే ఏంటని అంటున్నారు ఓ ఎమ్మెల్యే. 58 ఏళ్ల వయసులో పదో తరగతి హాజరైన ఆ ఎమ్మెల్యే  తీరు ఇప్పుడు సోషల్‌ మీడియాలో చర్చగా మారింది. 

ఒడిశా పుల్బానీ నియోజకవర్గ బీజేడీ ఎమ్మెల్యే అంగద కన్హార్‌.. శుక్రవారం మొదలైన పదో తరగతి పరీక్షలకు హాజరయ్యాడు. రుజంగీ హైస్కూల్‌ సెంటర్‌కు వెళ్లిన ఆయన.. ఫస్ట్‌ పేపర్‌ ఇంగ్లీష్‌ పరీక్ష రాశాడు. 1978లో పదో తరగతి దాకా వెళ్లిన ఆయన.. కుటుంబ సమస్యలతో పరీక్షకు హాజరు కాలేకపోయాడట. అయితే వయసు పైబడిన వాళ్లెందరో.. బిడియాన్ని పక్కనపెట్టి పరీక్షలకు హాజరవుతుండడం తాను గమనించానని, అందుకే తాను తన విద్యను పూర్తి చేయాలనుకుంటున్నానని అంగద చెప్తున్నారు. పైగా చదువుకుంటే పెరిగేది  జ్ఞానమే కదా.. సిగ్గుపడాల్సిన అవసరం ఎందుకు? అంటున్నాడు.

అయితే పరీక్ష ఆయన ఒక్కడే రాశాడు అనుకోకండి. తోడుగా ఆయన పాత స్నేహితులు ఇద్దరు కూడా పరీక్షలకు హాజరుకాగా, అందులో ఓ పెదదాయన ఒక ఊరికి సర్పంచ్‌ కూడా.  ఇక.. ఆ స్కూల్‌ ఎగ్జామ్‌ సెంటర్‌లో మధ్యలో చదువు ఆపేసిన వాళ్లు చాలామందే ఎగ్జామ్‌ రాశారట. అందులో అత్యధిక వయస్కుడు అంగదనే కావడం గమనార్హం.  ఒడిశాలో శుక్రవారం నుంచి మొదలైన బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎగ్జామ్స్‌కు 5.8 లక్షల మంది హాజరయ్యారు. మే 10వ తేదీ వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి.

మరిన్ని వార్తలు