అచ్చం ఆధార్‌ కార్డే.. కానీ కాదు! పెళ్లి కొడుకు క్రియేటివిటీకి సోషల్‌ మీడియా ఫిదా

7 Feb, 2022 09:16 IST|Sakshi

భువనేశ్వర్‌: కోవిడ్‌ నియంత్రణలో భాగంగా పండగలు, ఉత్సవాలు, వివాహాది శుభకార్యాల నిర్వహణపై ప్రభుత్వ ఆంక్షలు అమలులో ఉన్నాయి. ఏ కార్యక్రమం అయినా జనసమూహానికి తావులేకుండా పరిమిత వ్యక్తులతో కోవిడ్‌ మార్గదర్శకాలకు అనుగుణంగా జరుపుకోవాలనేది ప్రధానమైన నిబంధన. ఈ నేపథ్యంలో త్వరలో పెళ్లి చేసుకోబోతున్న ఛత్తీస్‌గఢ్‌లోని యశ్‌పూర్‌ జిల్లా, ఫర్‌సభ సమితి, అంకిరా గ్రామానికి చెందిన లోహిత్‌ సింఘ్‌ కాస్త వినూత్నంగా ఆలోచించాడు.

ఆధార్‌ తరహాలో తన పెళ్లి కార్డ్‌ను ప్రింట్‌ చేయించి, బంధుమిత్రులకు పంచిపెట్టాడు. పెళ్లికి విచ్చేసే వారంతా ముఖానికి మాస్క్‌ ధరించడమే కాకుండా భౌతికదూరం పాటించాలని పిలుపునిస్తూ శుభలేఖలో పేర్కొనడం విశేషం. బార్‌ కోడ్‌ సైతం కలిగి ఉన్న ఈ కార్డ్‌లో ఆధార్‌ నంబరు స్థానంలో పెళ్లి తేది, అడ్రస్‌ స్థానంలో ఆచరించాల్సిన కోవిడ్‌ నియమాలు ఉండడం ప్రత్యేక ఆకర్షణ. ప్రస్తుతం ఈ పత్రిక సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. గతంలో సైతం ఈ తరహా వెడ్డింగ్‌ కార్డులు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు