బంధాలను బలిచేస్తూ.. ఆ అమ్మ ఎందుకు అలా చేసింది?

5 Dec, 2022 12:16 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

ఎల్‌ఎన్‌ పేట (హిరమండలం): జన్మనిచ్చిన అమ్మే ఆ పాప ఆయుష్షు ఆపేసింది. ఊపిరినిచ్చిన తల్లి ఉసురు తీసింది. గోరుముద్దలు తినిపించిన చేతితోనే విషం పెట్టింది. తానూ ఆ విషమే తీసుకుని బలవన్మరణానికి పాల్పడింది. రజని(27) అనే మహిళ ఆత్మహత్య చేసుకుని తన కుమార్తె జ్యోత్స్న(3)కు కూడా విషమిచ్చింది. ఈ విషాదకర ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. 

ఒడిషా హిరమండలం మేజర్‌ పంచాయతీ శుభలయ కాలనీ ఎస్టీ వీధికి చెందిన తంప వెంకటరమణ తాపీ మేస్త్రీగా పని చేస్తుంటారు. ఈయనకు జలుమూరు మండలం జమినివలసకు చెందిన రజనీతో 2015లో వివాహమైంది. ఇద్దరూ కూలి పనులు చేసుకుంటూ బతుకుతుండేవారు. వీరికి హర్షిణి (5), జ్యోత్స్న (3) అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వెంకటరమణ వలస వెళ్తూ ఉండేవారు. ఇటీవలే సొంతూరు వచ్చేశారు. ఈ నెల 2వ తేదీ శుక్రవారం వెంకటరమణ రోజూ లాగానే తన పనికి వెళ్లిపోయారు. ఇంటిలో చిన్నపిల్ల జ్యోత్స్న అపస్మారక స్థితిలో ఇరుగుపొరుగు వారికి కనిపించడంతో వారు పాపను హిరమండలం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ సమాచారాన్ని వెంకటరమణకు చెప్పగా.. ఆయన హుటాహుటిన ఆస్పత్రికి చేరుకున్నారు. 

పాప పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో స్థానిక డాక్టర్లు 108 అంబులెన్స్‌లో శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. ఈ గొడవలో ఉండగానే వెంకటరమణకు మరోసారి బంధువులు ఫోన్‌ చేశారు. రజనీ ఆరోగ్య పరిస్థితి కూడా బాగోలేదని, ఆమె కూడా అపస్మారక స్థితిలో ఉందని చెప్పారు. దీంతో ఆయన తన బావమరుదులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి రజనీని హిరమండలం ప్రభుత్వాస్పత్రికి తరలించగా అక్కడి నుంచి శ్రీకాకుళం రిమ్స్‌కు రిఫర్‌ చేశారు. రిమ్స్‌లోనే చిన్నారి జ్యోత్స్న శనివారం అర్ధరాత్రి తర్వాత కన్నుమూయగా.. ఆదివారం రజనీ మృతి చెందారు. 

రజనీ విషం తాగి ఆత్మహత్యాయత్నం చేసిందని, పాపకు కూడా అదే విషం ఇచ్చిందని వారికి వైద్యులు తెలిపినట్లు సమాచారం. భర్త వెంకటరమణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని హిరమండలం ఇన్‌చార్జి ఎస్‌ఐ ఎం.గోవింద్‌ తెలిపారు. అఘాయిత్యానికి గల కారణాలను పోలీసులు అన్వేషిస్తున్నారు.

మరిన్ని వార్తలు