హాకీ ప్రపంచకప్‌కు సన్నాహాలు

23 Aug, 2022 22:49 IST|Sakshi

భువనేశ్వర్‌: హాకీ ప్రపంచకప్‌–2023 టోర్నమెంట్‌ అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం చురుగ్గా సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సురేష్‌చంద్ర మహాపాత్రొ అధ్యక్షతన అనుబంధ విభాగాల ఉన్నత అధికారులతో సోమవారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. స్థానిక లోక్‌సేవా భవన్‌లో జరిగిన ఈ సమావేశానికి ముఖ్యమంత్రి వ్యక్తిగత కార్యదర్శి వీకే పాండ్యన్, క్రీడా విభాగం కార్యదర్శి ఆర్‌.వినీల్‌కృష్ణ, వివిధ విభాగాల ప్రముఖులు, ముఖ్య కార్యదర్శులు హాజరయ్యారు. కటక్, రౌర్కెలా ప్రాంతాల నుంచి అనుబంధ వర్గాలు వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.

వరుసగా రెండోసారి హాకీ పురుషుల ప్రపంచకప్‌ టోర్నమెంట్‌ నిర్వహిస్తుండడం రాష్ట్రానికి ఎంతో గర్వకారణమని పేర్కొన్నారు. గతంలో 2018లో తొలిసారి ఈ టోర్నమెంట్‌ విజయవంతంగా నిర్వహించడంపై ఆనందం వ్యక్తంచేశారు. ప్రపంచవ్యాప్తంగా హాకీ క్రీడాకారులు, క్రీడాభిమానులు, నిర్వాహక వర్గాలు టోర్నమెంట్‌ నిర్వహణకు ప్రసంశలు కురిపించారని గుర్తుచేశారు. ఈసారి గతంకంటే ఘనంగా ఆద్యంతం విజయవంతం చేయాలని చీఫ్‌ సెక్రటరీ అధికారులకు పిలుపునిచ్చారు.

ఈ దఫా ఒకేసారి రెండు వేర్వేరు చోట్ల నిర్వహించడం ప్రత్యేకతగా పేర్కొన్నారు. భువనేశ్వర్‌ లోని కలింగ స్టేడియం, రౌర్కెలా ప్రాంతంలో హాకీ పురుష ప్రపంచకప్‌–2023 టోర్నమెంట్‌ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. 2017లో ప్రభుత్వం నిర్వహించిన ఏషియన్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌ టోర్నమెంట్‌ కావడం క్రీడాలోకంలో జయజయ ధ్వానాలు నేటికి మార్మోగడం అద్భుత విజయంగా వివరించారు. హాకీ ప్రపంచకప్‌ మ్యాచ్‌ల కోసం రౌర్కెలా స్టేడియం శరవేగంగా సిద్ధమవుతోందని క్రీడా విభాగం కార్యదర్శి వినీల్‌కృష్ణ తెలిపారు.  

మరిన్ని వార్తలు