ఒడిశా ప్రభుత్వం ముందడుగు.. వారి బాల్యానికి భరోసా!

28 Mar, 2022 21:22 IST|Sakshi

భువనేశ్వర్‌: నేరారోపణతో తల్లిదండ్రులు జైలు పాలైన సందర్భాల్లో ఆయా కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నాయి. ఇంట్లో ఆదరణ లేక ఆ పిల్లలు కూడా నేర చరితులుగానే తయారవుతున్నారు. మరికొంత మంది రోడ్డున పడుతున్నారు. ఇటువంటి పరిస్థితులను సమూలంగా మార్చి వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేసింది. నిబంధనల ప్రకారం జైలులో తల్లిదండ్రులతో కలిసి ఉంటున్న బాలలకు మధ్యాహ్న భోజనం సరఫరా చేయనున్నారు. కారాగారంలో ఉంటున్న వారి బిడ్డలు అలనాపాలనా చూసుకునేందుకు నిర్ధారిత నిబంధనల పరిధిలో ఇదే తరహా సదుపాయం కల్పించేందుకు ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది.

ఖైదీల బిడ్డల చదువులు, వారి మానసిక, శారీరక ఆరోగ్యం, ఇతరేతర సంక్షేమ, సంరక్షణ కార్యకలాపాలు క్రమబద్ధీకరించేందుకు చర్యలు చేపట్టింది. కారాగారంలో ఉంటున్న వారి బిడ్డలకు ఈ సదుపాయం వర్తిస్తుందని తెలిపారు. తల్లిదండ్రుల కారాగారవాసం 60 రోజులు పైబడితే ఈ సదుపాయం లభిస్తుంది. ఈ నేపథ్యంలో బాలల సంక్షేమానికి రాష్ట్ర మహిళ–శిశు సంక్షేమశాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. ప్రధానంగా ఆరేళ్ల లోపు ఉన్న బాలల సంక్షేమం పట్ల విభాగం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుంది. బాల నేరస్తుల చట్టం ప్రకారం శిశు సంక్షేమ కమిటీ జైలు బయట ఉన్న బాలల సంక్షేమం, సంరక్షణకు జారీ చేసిన మార్గదర్శకాల పరిధిలో ఉన్న బాలలకు మధ్యాహ్న భోజనం లభిస్తుంది. ఈ మార్గదర్శకాల వాస్తవ కార్యాచరణ సరలీకరించేందుకు జైలు ఆవరణలో అంగన్‌వాడీ కేంద్రం ఏర్పాటు చేయనున్నారు. ఇది నోడల్‌ అంగన్‌వాడీ కేంద్రంగా పని చేస్తుంది. జిల్లా కలెక్టర్‌ ఈ కార్యకలాపాలను ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తారు. 

టీకాలు.. పౌష్టికాహారం.. 
బాల ఖైదీలు అధికంగా ఉన్న జైళ్ల ఆవరణలో జైలు మాన్యువల్‌ నిబంధనల పరిధిలో తాత్కాలిక అంగన్‌వాడీ కేంద్రం అదనంగా ఏర్పాటు అవుతుందని విభాగం తెలిపింది. తల్లిదండ్రులతో కారాగారంలో ఉంటున్న బిడ్డలకు పౌష్టికాహారం, క్రమం తప్పకుండా టీకాలు వేయించడం చేపడతారు. తక్కువ మంది పిల్లలు ఉన్న అంగన్‌వాడీ కేంద్రం సిబ్బంది జైలు ఆవరణలో ఏర్పాటైన తాత్కాలిక అదనపు అంగన్‌వాడీ కేంద్రం కార్యకలాపాలు నిర్వహిస్తారని మహిళ–శిశు సంక్షేమ శాఖ స్పష్టం చేసింది. తల్లి అంగీకారంతో 6 ఏళ్ల బాలలకు సంరక్షకుల చెంతనే ఉండేందుకు అనుమతిస్తారు.

జిల్లా సురక్షా యూనిట్‌ జైలులో ఉంటున్న తల్లీబిడ్డలను అవగాహన పరిచి, అనుబంధ సౌకర్యాలు కల్పిస్తుంది. 6 నుంచి 14 ఏళ్ల బాలలకు విద్యాభ్యాసం తప్పనిసరి. తల్లిదండ్రులు కారాగారంలో ఉండి బయట ఉన్న పిల్లల చదువులకు ప్రభుత్వం నిర్వహిస్తున్న పలు విద్యా ప్రోత్సాహక పథకాలు వర్తింపజేస్తారు. బిజూ శిశుసురక్షా యోజన, ఫాస్టర్‌ కేర్‌ వంటి పథకాలు కార్యాచరణలో ఉన్నట్లు మహిళ–శిశు సంక్షేమశాఖ పేర్కొంది. తల్లిదండ్రుల నుంచి దూరంగా ఉంటున్న బిడ్డలతో కనీసం నెలకు ఒకసారి వ్యక్తిగతంగా కలవడం లేదా ఫోన్‌ ద్వారా మాట్లాడటం వంటి సదుపాయం కల్పిస్తారు. జిల్లా, సర్కిల్‌ జైలు అధికారులు ప్రతి 3నెలలకు ఒకసారి బిడ్డల మానసిక వికాసం ఇతరేతర అంశాలను అనుబంధ వర్గాలతో సంప్రదించి సమగ్ర నివేదిక దాఖలు చేయాలని విభాగం ఆదేశించింది. 
 

మరిన్ని వార్తలు