సంతలో లస్సీ.. 100 మంది ప్రాణం మీదకు వచ్చింది.. 

1 May, 2021 18:05 IST|Sakshi

భువనేశ్వర్‌: వేసవి కాలం కావడంతో చల్లగా లస్సీ తాగి సేదతీరిన వ్యక్తులు అకస్మాత్తుగా అస్వస్థతకు గురయ్యారు. సరదాగా తాగిన లస్సీ వారి ప్రాణం మీదకు వచ్చింది. అలా ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా వంద మందికిపై అనారోగ్యం బారిన పడ్డారు. ఈ ఘటన ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లా కుర్తి గ్రామంలో చోటుచేసుకుంది. ప్రస్తుతం బాధితులంతా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై వైద్యాఆరోగ్య శాఖ అధికారులు విచారణ చేపట్టారు. శుక్రవారం కుర్తిలో వారాంతపు సంత జరుగుతుండడంతో పెద్ద సంఖ్యలో ప్రజలు వచ్చారు.

ఎండ తీవ్రంగా ఉండడంతో ప్రజలు స్వాంతన కోసం అక్కడ ఉన్న ఓ దుకాణంలో చల్లగా లస్సీ తాగారు. లస్సీ తాగి వారి పనులు ముగించుకుని వెళ్లారు. కొద్దిసేపటికి లస్సీ తాగిన వారికి తీవ్ర కడుపునొప్పి వచ్చింది. చాలామందికి తీవ్రంగా కడుపునొప్పి రావడంతో ఒక్కసారిగా ఆస్పత్రులకు బాధితులు వచ్చారు. వంద మందికిపైగా జబ్బు పడ్డారు. దీంతో వైద్యులు కంగారుపడ్డారు. బాధితులంతా ఒకే సమస్యతో బాధపడుతున్నారని గుర్తించి వివరాలు సేకరించారు. ఈ విచారణలో అందరూ లస్సీ తాగారని గుర్తించి ఆ లస్సీ వలనే కడుపునొప్పి వచ్చిందని నిర్ధారించారు. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉందని సమాచారం.

ఈ ఘటనతో వెంటనే స్పందించిన సీడీఎంఓ ప్రఫుల్లా కుమార్‌ నందా కుర్తి గ్రామాన్ని సందర్శించారు. వైద్యాధికారులు సందర్శించి ఆ దుకాణం వద్ద వివరాలు సేకరించారు. గ్రామంలో ఎవరైనా ఈ బాధతో పడుతున్నారో గుర్తించారు. లస్సీ తాగడంతో కడుపునొప్పి రావడానికి గల కారణాలను తెలుసుకుంటున్నారు. లస్సీలో ఏమైనా కలిసిందా? లేదా వాడిన ఐస్‌ మంచిదేనా? శుభ్రమైన నీరు వాడరా? లేదా? అనే విషయాలు వైద్య శాఖ అధికారులు ఆరా తీస్తున్నారు.

చదవండి: ఆక్సిజన్‌ అందక కర్నూలులో ఐదుగురు మృతి
చదవండి: ‘భారత్‌ కోలుకో’: నయాగారా జలపాతం త్రివర్ణశోభితం

మరిన్ని వార్తలు