Odisha: కాంగ్రెస్‌ ఎమ్మెల్యే, మాజీ ఐఏఎస్‌ అధికారికి మూడేళ్లు జైలు

30 Sep, 2022 09:55 IST|Sakshi
మాజీ ఐఏఎస్‌ అధికారి వినోద్‌కుమార్, ఎమ్మెల్యే మహ్మద్‌ మొకీమ్‌ 

భువనేశ్వర్‌: కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు, కటక్‌–బరాబటి ఎమ్మెల్యే మహ్మద్‌ మొకీమ్‌కు న్యాయస్థానం మూడేళ్లు జైలుశిక్ష విధించింది. భువనేశ్వర్‌ లోని విజిలెన్స్‌ స్పెషల్‌ జడ్జి కోర్టు విచారణ పురస్కరించుకుని ఈ తీర్పు గురువారం వెలువడింది. ఒడిశా గ్రామీణ గృహనిర్మాణం, అభివృద్ధి కార్పొరేషన్‌(ఓఆర్‌హెచ్‌డీసీ) అవినీతి వ్యవహారంలో ఆయన నిందితుడిగా అభియోగాలు ఎదుర్కొన్నారు. 2001లో ఓఆర్‌హెచ్‌డీసీ పలువురికి అక్రమంగా రుణాలు మంజూరు చేసింది.

ఈ వ్యవహారంలో సమగ్రంగా రూ.1.5 కోట్లు దారి మళ్లాయి. దీనిలో ఎమ్మెల్యే కూడా లబ్ధిదారుడిగా పేరు ఉన్నట్లు గుర్తించారు. అప్పట్లో కార్పొరేషన్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా వ్యవహరించిన ఐఏఎస్‌ అధికారి వినోద్‌కుమార్‌ ఈ అక్రమంలో పాత్రధారిగా పట్టుబడ్డారు. ఈ నేపథ్యంలో దాఖలైన కేసు విచారణ గురువారంతో ముగించిన విజిలెన్స్‌ కోర్టు.. తుది తీర్పు వెల్లడించింది.

దీని ప్రకారం ఎమ్మెల్యే మొకీత్‌తో పాటు ప్రస్తుతం ఉద్యోగ విరమణ పొందిన ఐఏఎస్‌ అధికారి వినోద్‌కుమార్, ఓఆర్‌హెచ్‌డీసీ సెక్రటరీ స్వస్తిరంజన మహంతి, మెట్రో బిల్డర్స్‌ సంస్థ డైరెక్టర్‌ పియూష్‌ మహంతికి విజిలెన్స్‌ కోర్టు మూడేళ్లు కారాగార శిక్ష ప్రకటించింది. అలాగే రూ.50 వేల చొప్పున జరిమానా విధించింది. ఈ మొత్తం చెల్లించని పక్షంలో అదనంగా మరో 6 మాసాలు కఠిన కారాగార శిక్ష అనుభవించాల్సి ఉంటుందని కోర్టు స్పష్టం చేసింది.

మరిన్ని వార్తలు