వీడియో: వీపున చంటిబిడ్డ.. ఎర్రటి ఎండలో వీధులు ఊడుస్తున్న ఓ తల్లి కథ ఇది

30 May, 2022 11:00 IST|Sakshi

వీపున పసిబిడ్డను కట్టుకుని.. బ్రిటిష్‌ సైన్యంతో వీరోచిత పోరాటం చేసింది వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి. ఇక్కడో లక్ష్మీ వీపున చంటిబిడ్డను కట్టుకుని ఎర్రటి ఎండలో చెమటలు చిందిస్తూ పని చేస్తోంది. సోషల్‌ మీడియాను విపరీతంగా ఆకట్టుకుంటున్న వీడియో, ఫొటోలు విపరీతంగా వైరల్‌ అవుతున్నాయి. 

లక్ష్మీముఖి.. ఒడిషా మయూర్‌భంజ్‌ బర్దిపాడా మున్సిపాలిటీలో పదేళ్లుగా స్వీపర్‌గా పని చేస్తోంది. అక్కడ పని చేస్తుండగానే ఓ దినసరి కూలీకి ఇచ్చి పెళ్లి చేసింది ఆమె కుటుంబం.  భర్త పచ్చితాగుబోతు. ఒకరోజు బిడ్డను అమ్మేయాలని ప్రయత్నించాడు. అతని చాచికొట్టి.. బిడ్డతో సహా బయటకు వచ్చేసింది. స్థానికంగా ఓ ఇంట్లో ఒంటరిగానే ఉంటూ.. చంటి బిడ్డను చూసుకుంటోంది. 

 ఇంటి దగ్గర బిడ్డను చూసుకునేవాళ్లు ఎవరూ లేకపోవడంతో బిడ్డను తనతో పాటే పనులను తెచ్చుకుంది. బిడ్డను వీపున కట్టుకోవడం తనకేం ఇబ్బందిగా అనిపించడం లేదని, తన డ్యూటీ తాను చేస్తున్నట్లు చెప్తోందామె. వ్యక్తిగత కారణాలతో ఆమె బిడ్డను తెచ్చుకుంటోందని, ఆమెకు అవసరమైన సాయం, ఇబ్బందులు ఎదురైతే సపోర్ట్‌ చేయాలని సిబ్బందికి సూచించినట్లు బర్దిపాడా మున్సిపాలిటీ చైర్మన్‌ బాదల్‌ మోహంతి చెప్తున్నారు.   

బిడ్డను వీపున కట్టుకుని వీధులు ఊడుస్తున్నా ఆ తల్లి కష్టానికి పలువురు హ్యాట్సాఫ్‌ చెప్తున్నారు. అయినా కడుపున బిడ్డను నవమాసాలు మోసే తల్లికి.. వీపున మోయడం ఓ బరువా?.. అని అంటున్నారు మరికొందరు.

వీడియో వైరల్: ఆ చిన్నారికి నాలుగు చేతులు, నాలుగు కాళ్లు!!

మరిన్ని వార్తలు