ఐసీయూలో పద్మశ్రీ కమలా పుజారి.. బలవంతంగా డ్యాన్స్‌ వేయించినందుకు ఆగ్రహం

2 Sep, 2022 15:26 IST|Sakshi

భువనేశ్వర్‌: ఒడిషాకు చెందిన పద్మశ్రీ అవార్డు గ్రహీత  కమలా పుజారి తీవ్ర అనారోగ్యంతో ఈ మధ్య ఆస్పత్రి పాలయ్యారు. ఆమె పరిస్థితి విషమించిందని, కోలుకోవడం కష్టమని వైద్యులు సైతం చేతులేత్తేశారు. అయితే 71 ఏళ్ల ఆ పెద్దావిడ అనూహ్యంగా కోలుకుని.. ఇంటికి చేరుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇదిలా ఉంటే.. 

ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యే ముందు.. ఐసీయూలో ఆమె డ్యాన్స్‌ చేసిన వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో విపరీతంగా వైరల్‌ అయ్యింది. దీంతో సదరు వీడియోపై ఆమెకు ప్రశ్నలు ఎదురుకాగా.. ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆరోగ్యం బాగోలేకున్నా తనతో బలవంతంగా డ్యాన్స్‌ చేయించారంటూ ఆమె సోషల్‌ వర్కర్‌ మమతా బెహెరాపై ఆరోపణలు గుప్పించారు. 

‘డ్యాన్స్‌ చేయాలనే ఉద్దేశం నాకు ఎంత మాత్రం లేదు. వద్దని నేను ఆమెతో(మమతను ఉద్దేశించి) చెప్తూనే ఉన్నా. కానీ, ఆమె వినలేదు. అప్పటికే నేను అనారోగ్యంతో కుంగిపోయి ఉన్నా. ఒపిక లేదు. అయినా బలవంతంగా నాతో ఆమె డ్యాన్స్‌ చేయించింది’ అని కోరాపుట్‌లో తన ఆరోగ్యంపై పరామర్శించేందుకు వచ్చిన మీడియాతో కమల పేర్కొన్నారు. 

ఇదిలా ఉంటే.. ఒడిషా పజారా గిరిజన తెకు చెందిన కమలా పుజారికి వ్యవసాయ రంగంలో అందించిన సేవలకు గానూ భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీని 2019లో అందుకున్నారు. సేంద్రీయ వ్యవసాయం, 100 రకాల పాతతరం విత్తనాల నిల్వకుగానూ ఆమె ఈ గౌరవం దక్కింది. అయితే.. కిడ్నీ సంబంధిత అనారోగ్యంతో ఆమె పరిస్థితి విషమించగా.. ఇప్పుడిప్పుడే ఆమె కోలుకుంటున్నారు. 

ఇక బలవంతంగా ఆమెతో డ్యాన్స్‌ చేయించిన ఘటనకుగానూ.. మమతపై ఒడిషా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పజారా తెగ సంఘం నేత హరీష్‌ ముదులీ డిమాండ్‌ చేస్తున్నారు. లేకపోతే.. ఆందోళన చేపడతాని హెచ్చరించారు. మరోవైపు ఆమె చికిత్స అందుకున్న కటక్‌ ఎస్‌సీబీ మెడికల్‌ కాలేజ్‌ హాస్పిటల్‌ ఈ వ్యవహారంపై స్సందించింది. పుజారా ఐసీయూలో అడ్మిట్‌ కాలేదని, ఆమెకంటూ ప్రత్యేకమైన క్యాబిన్‌ ఒకటి కేటాయించామని, ఆ క్యాబిన్‌లోనే సదరు డ్యాన్స్‌ వీడియో వైరల్‌ అయ్యిందని ఒక ప్రకటనలో తెలిపింది. ఇక పుజారితో పాటు ఆస్పత్రిలో వెంట ఉన్న రాజీబ్‌ హిలాల్‌.. మమతా బెహెరా ఎవరో తనకు తెలియదని, అభిమానంటూ సెల్ఫీలు తీసుకోవడానికి వచ్చి ఇదంతా చేసిందని తెలిపారు. మమతా బెహెరా మాత్రం ఆమెలో బద్ధకాన్ని పొగొట్టి.. హుషారు నింపేందుకు అలా చేయించానని చెప్తున్నారు. 

Video Source: OTV

ఇదీ చదవండి: బస్సు ఫుట్‌బోర్డు ప్రయాణం.. చావు తప్పి..

మరిన్ని వార్తలు