రైలు ప్రమాదానికి వారే కారణం అంటూ పుకార్లు.. స్పందించిన ఒడిశా పోలీస్

4 Jun, 2023 18:20 IST|Sakshi

ఒడిశా రైలు ప్రమాదానికి బాలాసోర్ కు చెందిన ఒక వర్గం వారు పన్నిన కుట్రే కారణమంటూ సోషల్ మీడియాలో వదంతులు పుట్టించే ప్రయత్నం చేస్తున్న వారినుద్దేశించి ఒడిశా పోలీసులు తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. ట్విట్టర్ వేదికగా స్పందించిన పోలీసులు మతసామరస్యాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు. 

పథకం ప్రకారమే...
బాలాసోర్ రైలు ప్రమాదం అనేక కుటుంబాలను చిన్నాభిన్నం చేసి తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ ప్రమాదంలో ప్రాణాలు  కోల్పోయినవారి కుటుంబాలు ఎప్పటికి తేరుకుంటాయో అర్ధం కానీ స్థితిలో దేశ ప్రజానీకం ఉంటే, ఒక ఆకతాయి మూక మాత్రం రైలు ప్రమాదానికి మతం రంగు పులిమే ప్రయత్నం చేసి అనవసర వివాదానికి తెరతీసింది. బాలాసోర్ కు సమీపంలో ఒక వర్గం వారు కుట్ర పన్ని రైలు ప్రమాదానికి కారణమయ్యారని సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. క్షణాల్లో వైరల్ గా మారిన ఈ పుకార్లపై ఖాకీలు తీవ్రంగా స్పందించారు. ట్విట్టర్ వేదికగా ఆకతాయిలకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.

తాట తీస్తామన్న పోలీసులు... 
ఒడిశా పోలీసులు ఏమన్నారంటే... సోషల్ మీడియాలో కొంతమంది ఒడిశా పెను విషాద సంఘటనకు మతం రంగు పులుముతున్నట్లు మా దృష్టికి వచ్చింది. ఇది అత్యంత దురదృష్టకరం. గవర్నమెంట్ రైల్వే పోలీసుల ఆధ్వర్యంలో ప్రమాదానికి గల కారణాలపై విచారణ జరుగుతోంది. దయచేసి చెడు ప్రేరణ కలిగించే తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయవద్దు.  ఈ విధమైన పుకార్లను ప్రచారం చేసి మతసామరస్యాన్ని దెబ్బతీస్తే మాత్రం చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఇది కూడా చదవండి: గుట్టలు గుట్టలుగా మృతదేహాలు.. ఎక్కడా ఖాళీ లేదు

మరిన్ని వార్తలు