లాక్‌డౌన్‌ ఉల్లంఘన.. స్టెప్పులేసిన మహిళా తహసీల్దార్‌

24 May, 2021 12:02 IST|Sakshi

భువ‌నేశ్వ‌ర్ : కరోనా కట్టడికి కఠిన ఆంక్షలు అమలు చేస్తున్న వేళ లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించి ప్రవర్తించారు ఓ తహసీల్దార్‌. ముఖానికి మాస్క్‌, సామాజిక దూరం పాటించకుండా ఓ వేడుకలో ఇష్టారీతీగా స్టెప్పులు వేశారు. ఈ వీడియో నెట్టింట్లో వైరలవ్వడంతో సదరు అధికారిణిపై నెటిజన్లు ఫైర్‌ అవుతున్నారు. అసలేంజరిగిందంటే.. తీవ్రంగా వ్యాపిస్తున్న కోవిడ్‌ను అదుపులోకి తీసుకొచ్చేందుకు  ఒడిశా ప్ర‌భుత్వం లాక్‌డౌన్‌ను అమ‌లు చేస్తోంది. ఈ క్రమంలో వివాహ వేడుక‌ల‌కు కేవ‌లం 25 మందికి మాత్ర‌మే ప్ర‌భుత్వం అనుమ‌తి ఇచ్చింది.

ఈ నేపథ్యంలో ఒడిశాలోని సుకిందా మహిళా త‌హ‌సీల్దార్ బుల్బుల్‌ బెహెరా లాక్‌డౌన్ నిబంధ‌న‌లు అతిక్రమించారు. జగత్‌సింగ్‌పూర్‌లో తన సోదరుడి వివాహ వేడుకకు తహసీల్దార్‌ హాజరయ్యారు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉన్నా.. ఈ వేడుక ఊరేగిపులో లాక్‌డౌన్‌ మార్గదర్శకాలు పాటించకుండా బెహెరా డ్యాన్స్‌ చేశారు. ముఖానికి మాస్క్‌, సామాజిక దూరాన్ని గాలికొదిలేసి బంధువులతో కలిసి తీన్‌మార్‌ స్టెప్పులేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీంతో కోవిడ్‌ కట్టడి చర్యలను ప్రజలకు తెలియజేయాల్సిన అధికారులే నిబంధనలను ఉల్లంఘిస్తున్నారంటూ నెటిజన్లు ఓ రేంజ్‌లో మండిపడుతున్నారు.

ఇక ఈ వీడియో ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో జాజ్‌పూర్ జిల్లా క‌లెక్ట‌ర్ చ‌క్ర‌వ‌ర్తి సింగ్ రాథోడ్ స్పందించారు. ప్ర‌స్తుతం ఆ మ‌హిళా అధికారిర్ సెల‌వులో ఉన్నట్లు వెల్లడించారు.సెల‌వులు ముగిసి వీధుల్లో చేరిన త‌ర్వాత ఆమె నుంచి వివ‌ర‌ణ కోరి, త‌గు చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని పేర్కొన్నారు. మహమ్మారి వ్యాపిస్తున్న తరుణంలో నిబంధ‌న‌లు ఉల్లంఘిస్తే ఎవరినైనా విడిచిపెట్టేది లేదని స్ప‌ష్టం చేశారు. ఇదిలా ఉండగా గతనెల ఓ మహిళా హోంగార్డుతో నలుగురు పోలీసులు యూనిఫాంలో నృత్యం చేస్తున్న వీడియో వెలుగులోకి రావడంతో పానికోయిలి పోలీస్ స్టేషన్ ఏఎస్సైను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.

చదవండి: వైరల్‌: పెళ్లితో ఒక్కటైన జంట.. భూమ్మీద కాదండోయ్‌! 

మరిన్ని వార్తలు