ప్రాణం తీసిన నెట్‌వర్క్‌ సమస్య

19 Aug, 2021 14:49 IST|Sakshi

భువనేశ్వర్: ఆన్‌లైన్‌ పాఠాలు వినేందుకు కొండ మీదకు వెళ్లిన విద్యార్థి తిరిగి కిందకు రాలేదు. ప్రమాదవశాత్తు కొండపై నుంచి జారిపడి విద్యార్థి ప్రాణాలు విడిచిన ఘటన రాయగడ జిల్లా, పద్మపూర్‌ సమితి, పండరగుడలో మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. పండగరగుడలో నివశిస్తున్న ఆంధ్రయ జగరంగ(13).. జగరంగ కటక్‌ గ్రామంలోని ఓ ప్రైవేట్‌ స్కూల్‌లో ఏడో తరగతి చదువుతున్నాడు. కోవిడ్‌ కారణంగా వీరికి కేవలం ఆన్‌లైన్‌లోనే పాఠాలు చెబుతున్నారు.

గ్రామంలో నెట్‌వర్క్‌ సదుపాయం లేకపోవడంతో విద్యార్థులు జగరంగ కొండపైకి వెళ్లి, పాఠాలు వింటుంటారు. ఎప్పటిలాగే మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత ఆంధ్రయ కొండపైకి వెళ్లాడు. వానలు కురుస్తున్న కారణంగా ఆ దారంతా జారుడుగా ఉండడంతో ప్రమాదవశాత్తు అక్కడి కొండపై నుంచి కిందికి జారిపడిపోయాడు. దీంతో అతడి తలకు బలమైన గాయమైంది. ఈ విషయంపై తోటి విద్యార్థులు బాధిత కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఈ క్రమంలో అతడిని వైద్యసేవల కోసం పద్మపూర్‌లోని ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం ఉన్నత వైద్యం కోసం అక్కడి నుంచి బరంపురం ఎంకేసీజీ మెడికల్‌కి తరలిస్తుండగా, మార్గం మధ్యంలో ఆ విద్యార్థి చనిపోయాడు. ఈ దుర్ఘటనతో గ్రామంలో విషాద చాయలు అలముకున్నాయి.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు