Odisha Train Accident Live Updates: ప్రమాదానికి కారణమైన వారిని క్షమించం: ప్రధాని మోదీ

4 Jun, 2023 07:33 IST|Sakshi

ఒడిశా ఘోర రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. బోగీల నుంచి మృతదేహాల వెలికితీత కొనసాగుతోంది.  సహాయక చర్యల్లో ఎన్డీఆర్‌ఎఫ్‌తో పాటు ఆర్మీ సైతం పాల్గొంటోంది.  భువనేశ్వర్‌ సహా బాలేశ్వర్‌, భద్రక్‌, మయూర్‌భంజ్‌, కటక్‌లోని ఆస్పత్రల్లో క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్నారు. మరోవైపు క్షతగాత్రుల్లోనూ పలువురి పరిస్థితి విషమంగా ఉంది. బాధితుల్లో బెంగాలీవాసులే ఎక్కువ మంది ఉన్నారనేది ఒక అంచనా. ఇక మృతుల్లో, గాయపడిన వాళ్లలో తెలుగువాళ్లు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.  

ఘటనపై ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించాం: ప్రధాని మోదీ
రైలు ప్రమాదం తనను తీవ్రంగా కలచివేసిందని ప్రధాని మోదీ అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. చాలా రాష్ట్రాల ప్రజలు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు. ఘటనపై ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించాం.. ప్రమాదానికి కారకులపై చర్యలు తప్పవని ప్రధాని అన్నారు. రైలు ప్రమాద ఘటనా స్థలాన్ని, సహాయక చర్యలను ప్రధాని పరిశీలించారు. మోదీకి కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్‌, ధర్మేంద్ర ప్రధాన్‌ ప్రమాద వివరాలు వెల్లడించారు. అనంతరం రైలు ప్రమాదంలో గాయపడిన వారిని కటక్‌ ఆసుపత్రిలో ప్రధాని పరామర్శించారు.

విశాఖ రైల్వే స్టేషన్‌కు చేరుకున్న ప్రత్యేక రైలు
🚆💥బాలాసోర్‌ నుంచి విశాఖ మీదుగా చెన్నైకు ప్రత్యేక రైలు బయలుదేరింది. 210 మందితో విశాఖకు స్టేషన్‌కు చేరుకుంది. విశాఖ రైల్వే స్టేషన్‌లో 10 ప్రయాణికులు దిగారు.  ప్రత్యక్ష సాక్షులు మీడియాతో మాట్లాడుతూ, భూకంపం వచ్చిందని అనుకున్నామని, ఒక్కసారిగా రైలు కుదుపులకు గురై ప్రయాణికులు ఒకరి మీద ఒకరు పడిపోయారని చెప్పారు. కళ్ళ ముందే చాలామంది చనిపోయారన్నారు.

🚆💥బాలాసోర్‌లోని ఫకీర్‌ ఆసుపత్రికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేరుకున్నారు. అక్కడ రైలు ప్రమాదంలో గాయపడ్డ వారిని పరామర్శించారు

🚆💥ఒడిశా రైలు ప్రమాద స్థలానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేరుకున్నారు. రైలు ప్రమాద ఘటనా స్థలాన్ని, సహాయక చర్యలను పరిశీలించారు. మోదీకి కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్‌, ధర్మేంద్ర ప్రధాన్‌ ప్రమాద వివరాలు వెల్లడించారు. అనంతరం రైలు ప్రమాదంలో గాయపడిన వారిని కటక్‌ ఆసుపత్రిలో ప్రధాని పరామర్శించారు.

🚆💥 రైలు ప్రమాదానికి సిగ్నల్స్‌ ఫెయిల్యూరే కారణమని ప్రాథమిక దర్యాప్తులో రైల్వే శాఖ తేల్చింది. మెయిన్‌లైన్‌పైనే కోరమండల్‌కు సిగ్నల్‌ ఉందని, లూప్‌లైన్‌లో ఆగిఉన్న గూడ్స్‌ను కోరమండల్‌ ఢీకొట్టినట్లు రైల్వే శాఖ ప్రాథమిక నివేదికలో పేర్కొంది.

వారంతా సురక్షితం..
🚆💥 ఒడిశాలో రైళ్ల ప్రమాద ఘటన నేపథ్యంలో యంత్రాంగాన్ని అప్రమత్తం చేసినట్లు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్‌.ఢిల్లీరావు సాక్షి మీడియాకు తెలిపారు. జిల్లా కలెక్టరేట్‌లో హెల్ప్ లైన్(0866 2575833) ఏర్పాటు చేశామన్నారు. ప్రమాద ఘటనలో జిల్లా వాసులుంటే సమాచారం ఇవ్వాలని కోరారు.

రైల్వే అధికారులిచ్చిన సమాచారం మేరకు రెండు రైళ్లలో 42 మంది విజయవాడలో దిగవలసిన ప్రయాణీకులను గుర్తించామని,కోరమాండల్ ట్రైన్ లో 39 మంది విజయవాడలో దిగాల్సి ఉందన్నారు. 39 మందిలో 23 మందిని కాంటాక్ట్ చేశాం ..వారంతా సురక్షితంగా ఉన్నారు. మిగిలిన 16 మందిని కాంటాక్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాం. యశ్వంత్ పూర్ ట్రైన్ లో ముగ్గురు ప్రయాణీకులు విజయవాడలో దిగాల్సి ఉంది. వారి ఫోన్ నెంబర్లు కోసం ప్రయత్నిస్తున్నాం. కలెక్టరేట్ లో హెల్ప్ లైన్ 24 గంటలూ పనిచేసేలా సిబ్బందిని అందుబాటులో ఉంచామని  ఢిల్లీరావు తెలిపారు.

🚆💥 ఒడిశాకు బయలుదేరిన ప్రధాని మోదీ. 

🚆💥 రైలు ప్రమాద ఘటనా స్థలాన్ని ప్రధాని పరిశీలించనున్నారు. కటక్‌ ఆసుపత్రిలో క్షతగాత్రులను మోదీ పరామర్శించనున్నారు.

🚆💥 మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. రైలు ప్రమాదంపై కేంద్రం సమగ్ర దర్యాప్తు చేయాలి. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలి. రైలు ప్రమాదం వెనుక కుట్రకోణం ఉండొచ్చని మమత అనుమానం వ్యక్తం చేశారు. ఇప్పుడు రాజకీయాలు చేసే సమయం కాదు. క్షతగాత్రులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. 

🚆💥ప్రపంచ దేశాల దిగ్భ్రాంతి
ఒడిశా బాహనాగా బజార్‌ రైల్వే స్టేషన్‌ సమీపంలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇక ఈ ఘోర ప్రమాదంపై పలువురు ప్రపంచ అధినేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో, తైవాన్‌ ప్రెసిడెంట్‌ త్సాయ్ ఇంగ్ - వెన్, ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పెన్నీ వోంగ్‌,   శ్రీలంక విదేశాంగ మంత్రి అలీ సబ్రీ,   భారత్‌లో రష్యా రాయబారి డెనిస్‌ అలిపోవ్‌,   యూఎస్‌ జనరల్‌ అసెంబ్లీ ప్రెసిడెంట్‌ సాబా కోరోసి .. తదితరులు సంఘీభావం ప్రకటించారు. ఈ ఘోర ప్రమాదం నుంచి ఉపశమనం కోసం అవసరమైన సహాయం అందించేందుకు సిద్ధమని ఆయా దేశాలు ప్రకటించాయి కూడా. 

🚆💥 రైలు ప్రమాద ఘటనా స్థలానికి ప్రధాని నరేంద్రమోదీ వెళ్లనున్నట్లు తెలుస్తోంది. కటక్‌ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ఆయన పరామర్శించనున్నట్లు సమాచారం.  

🚆💥 పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బాలాసోర్‌ రైలు ప్రమాద ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుల్లో ఎక్కువగా బెంగాల్‌ ప్రజలే ఉన్నట్లు అంచనా.

🚆💥 బాలాసోర్‌ మృతుల సంఖ్య 238కి చేరిందని తెలుస్తోంది. 600 మందికి పైగా గాయాలు అయినట్లు రైల్వే శాఖ అధికార ప్రతినిధి అమితాబ్‌ శర్మ ప్రకటించారు.

🚆💥 ప్రమాదంపై కేంద్రం సమీక్ష
ఒడిశా బాలాసోర్‌ వద్ద ప్రమాదానికి గురైన కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ ఘటన.. పెను విషాదానికి కారణమైంది. ఈ ప్రమాద ఘటనపై కేంద్రం అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించనుంది. ప్రధాని మోదీ నేతృత్వంలో.. రైలు ప్రమాదం, సహాయక చర్యలపై ఈ సమావేశంలో సమీక్ష జరగనుంది. 

🚆💥 ఘోర ప్రమాదం తాలుకా ఏరియల్‌ దృశ్యాలు


🚆💥 ఇరవై నిమిషాల్లోనే అంతా.. మూడు రైళ్లూ ఇరవై నిమిషాల వ్యవధిలోనే ప్రమాదానికి గురయ్యాయని రైల్వే శాఖ ప్రాథమిక నిర్ధారణకు వచ్చింది. స్టేషన్‌ మాషస్టర్‌కు తెలిసేలోపు ఈ ప్రమాదాలు జరిగినట్లు అంచనా వేస్తున్నారు. అయితే.. ఏ రైలు ముందు వచ్చింది.. ఏది దేనిని ఢీ కొట్టిందనే విషయంలో అయోమయం నెలకొంది. ఈ విషయంపై రైల్వే శాఖలోని అధికారులు తలో మాట చెబుతూ గందరగోళానికి గురి చేస్తున్నారు. ఆగి ఉన్న గూడ్స్‌ రైలుపైకి కోరమాండల్‌ దూసుకెళ్లినట్లు దృశ్యాలు, పక్క ట్రాక్‌పై పడి ఉన్న కోరమాండల్‌ను బెంగళూరు-హౌరా ఎక్స్‌ప్రెస్‌ ఢీ కొట్టినట్లు  దృశ్యాలు కనిపిస్తున్నాయి అక్కడ. గూడ్స్‌ను ఢీ కొట్టడంతోనే కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రమాదానికి గురై ఉంటుందా? అనే అనుమానాలు బలపడుతున్నాయి.  

🚆💥 ఒడిశా బాలాసోర్‌ ఘోర రైలు ప్రమాద ఘటనపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తీవ్ర సంతాపం తెలియజేశారు. శనివారం ఉదయం ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించిన ఆయన.. అవసరమైన సాయం అందించేందుకు సిద్ధంగా ఉండాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. అందుకు తగ్గట్లే విశాఖ సరిహద్దుల్లోని ఆస్పత్రులు సిద్ధమవుతున్నాయి. అలాగే.. మంత్రి అమర్నాథ్‌ నేతృత్వంలోని ఓ బృందాన్ని ఘటనా స్థలానికి పంపేందుకు సీఎం జగన్‌ నిర్ణయించారు. 

🚆💥 ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ బాలాసోర్‌ రైలు ప్రమాద ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో కలిసి ఆయన అక్కడి అధికారులతో ప్రమాదం గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. 

🚆💥 కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ ఘటనా స్థలానికి చేరుకుని.. పరిస్థితిని సమీక్షించారు. ప్రమాదానికి కారణాలు అడిగి తెలుసుకోవడంతో సహాయక చర్యలను పర్యవేక్షించారు. ఆ సమయంలో ఆయన వెంట ఒడిశాకు చెందిన కేంద్ర శాఖమంత్రి (సహాయక) ప్రతాప్‌ చంద్ర సారంగి కూడా ఉన్నారు. ప్రమాదంపై అత్యున్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించిన విషయాన్ని మంత్రి అశ్విని వైష్ణవ్‌ మీడియాకు వెల్లడించారు. ‘‘ రైలు ప్రమాద ఘటన చాలా బాధాకరం. ప్రస్తుతం సహాయక చర్యల మీదే ఫోకస్‌ పెట్టాం. సహాయక చర్యలు వేగంగా కొనసాగుతున్నాయి. బాధితులకు మెరుగైన వైద్యం అందిస్తున్నాం. దర్యాప్తునకు హైలెవల్‌ కమిటీని నియమించాం.  విచారణ తర్వాతే ప్రమాదానికి కారణాలు చెప్పగలం’’ అని మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ మీడియాకు తెలిపారు.

🚆💥 ఇప్పటివరకు 233 మంది మృతదేహాలను వెలికి తీసినట్లు ఒడిశా చీఫ్‌ సెక్రటరీ పీకే జెనా ప్రటించారు. మరో 900 మందికి పైగా ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. బోగీల్లోనే మరో 600 నుంచి 700 మంది చిక్కుకుని ఉంటారని భావిస్తున్నారు. 250 ఆంబులెన్స్‌లు, 65 బస్సులు ఘటనా స్థలంలో సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయని తెలిపారాయన.

🚆💥 ఒక ప్యాసింజర్‌ రైలు.. అప్పటికే బోల్తా పడిన మరో రైలును ఢీ కొట్టడంతోనే ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు అధికారులు.

🚆💥 ఒడిశా పెను ప్రమాదం.. ఈ మధ్య కాలంలో దేశంలో చోటు చేసుకున్న అతిపెద్ద ప్రమాదం. బెంగళూరు-హౌరా సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌, షాలిమార్‌-చెన్నై సెంట్రల్‌ కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌, ఒక గూడ్స్‌ రైలు.. ఈ మృత్యు ఘోషకు కారణం అయ్యాయి. 

🚆💥 బాలేశ్వర్‌ జిల్లా బహనాగ రైల్వే స్టేషన్‌ వద్ద ఘటన శుక్రవారం రాత్రి 7 గంటల సమయంలో ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.  రైల్వే శాఖ మృతుల కుటుంబాలకు పది లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. ప్రమాదం ఎలా జరిగిందనేదానిపై దర్యాప్తు చేపట్టింది.

ఇదీ చదవండి: ఒడిశా ప్రమాదానికి కారణం అదేనా?

మరిన్ని వార్తలు