చీకటిలోనూ చెదరని ధైర్యం.. ఖాళీ చేతులతో 88 మందిని రక్షించి..

5 Jun, 2023 19:42 IST|Sakshi

ఒడిశా:ఎదో బాంబు పేలిన శబ్దం. వచ్చి చూస్తే.. ఘోర రైలు ప్రమాదం. ఎక్కడ చూసినా అరుపులు, మూలుగులు, రక్తం, చెదిరిపడిన శరీర భాగాలు అన్నీ ఒళ్లు జలదరించే దృశ్యాలే. వాటన్నింటినీ దాటుకుని దాదాపు 88 మంది ప్రాణాలను కాపాడారు ఆ ఇద్దరు యువకులు. రెస్క్యూ పరికరాలు ఏం లేకున్నా.. పడిపోయిన బోగీల్లోకి ధైర్యంగా వెళ్లి, ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారిని బయటికి తీశారు. గ్రామస్థుల సహకారంతో క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఆ యువకులే దీపక్ రంజన్, శుభంకర్ జెనాలు. రెస్క్యూ టీంలు రాకముందే ప్రమాదంలో సహాయక చర్యలు మొదలుపెట్టారు. 

అంతా అల్లకల్లోలం..
దీపక్ రంజన బెహ్రా ఒక రిటైర్డ్ ఆర్మీ అధికారి.. స్థానిక పిల్లలతో కలిసి మైదానంలో ఆటలాడుతున్నారు. ఆ సమయంలో ఓ పెద్ద శబ్దం వినిపించింది. వెళ్లి చూడగా.. ఘోర రైలు ప్రమాదం. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వారంతా కలిసి సహాయ చర్యలు మొదలుపెట్టారు. రాత్రి తొమ్మిదింటికి రెస్క్యూ బృందాలు వచ్చేవరకు అన్నీ తామే అయి చూసుకున్నారు. రాత్రంతా అక్కడే ఉండి నీళ్లు, ఆహారం పంచిపెట్టారు.'బోగీల వద్దకు మేము వెళ్లేసరికి అల్లకల్లోలంగా ఉంది. చీకటిగా ఉన్న బోగీల్లోకి వెళ్లి చాలామందిని బయటికి లాగాము. బోగీల కిందపడి కొంతమంది విపరీతంగా అరుస్తున్నారు' అని  చెప్పారు.

కళ్లలో మెదులుతున్నాయి..
'గాయపడ్డవారికి మొదటి గంట చాలా కీలకం. సరైన సమయానికి ఆస్పత్రికి తీసుకువెళితే బతికే అవకాశం ఉంటుంది. మేమంతా కలిసి మా దగ్గర ఉన్న వాహనాలలో క్షతగాత్రులను ఆస్పత్రికి తరిలించాము. గంట తర్వాత అంబులెన్సులు వచ్చాయి. రెస్క్యూ టీంలు వచ్చే సమయానికే మేము చాలా మందిని రక్షించాము' అని దీపక్ తెలిపారు. 

'మేము బోగి లోపలికి వెళ్లేసరికి ఓ గర్భవతి అరుస్తూ కనిపించింది. ఆమెను మేము బయటికి తీసుకురాగలిగాము. కానీ బోగీల లోపలే ఉన్న తన ఇద్దరు కుమారులను రక్షించమని ఆవిడ అడిగిన తీరు ఇంకా కళ్లలో మొదలుతోంది. ఆ భయానక దృశ్యాలు ఇంకా మా మనసును వెంటాడుతున్నాయి.' అని శుభంకర్ చెప్పారు. 

ఇదీ చదవండి:ఆ దుర్ఘటనలో కీలకంగా మారనున్న లోకోపైలట్‌ చివరి మాటలు..

మరిన్ని వార్తలు