వివిధ సంస్థలు.. బాధితులకు సేవలు

4 Jun, 2023 05:27 IST|Sakshi

కొరాపుట్‌/భువనేశ్వర్‌: రైలు దుర్ఘటన జరిగిన విషయం సామాజిక మాధ్యమాల్లో ప్రసారమైన వెంటనే బాలేశ్వర్, బద్రక్‌ జిల్లాల యువత స్పందించారు. ఎటువంటి పిలుపు లేకుండానే తమకు తాముగా సాయం అందించేందుకు ముందుకు కదిలారు. బద్రక్, బాలేశ్వర్‌ జిల్లా కేంద్రాల అస్ప త్రుల వద్దకు చేరుకొని, అవసరమైన క్షతగ్రాతులకు రక్తదానం చేసేందుకు సిద్ధమయ్యారు. రాత్రి నుంచి ఉదయం వరకు క్యూలోనే ఉండి రక్తదానం చేశారు. సుమారు వేయి మంది యువత రక్తదానం చేసి, ప్రాణదాతలుగా నిలిచారు.

సత్యసాయి భక్తుల సేవలు
రైల్వే దుర్ఘటన జరిగిన వెంటనే సత్యసాయి భక్తుల సేవలు మొదలయ్యాయి. ఘటన జరిగిన వెంటనే సత్యసాయి సేవా సమితి అఖిల భారత సమన్వయకర్త నిమిష్‌ పాండ్యా, జాతీయ సేవా సమన్వయకర్త కోటేశ్వరరావు వ్యక్తిగతంగా రంగంలోకి దిగారు. వారి సూచనతో సుమారు 70 మంది సత్యసాయి సేవాదళ్‌ కార్యకర్తలు ఘటనా స్థలానికి చేరుకున్నారు. తాము తెచ్చిన ట్రాక్టర్ల మీద క్షతగాత్రులు, మృతదేహాలను అస్పత్రులకు తరలించారు. వైద్య సిబ్బంది తగినంతమంది లేకపోవడంతో బాధితులకు తామే సపర్యలు చేసి, ప్రాథమిక చికిత్స అందజేశారు. అలాగే బాధితులకు ఆహారం, తాగునీరు అందించి, అందరి మన్ననలు పొందారు.

300 మందిని రక్షించిన ఎన్డీఆర్‌ఎఫ్‌
రైలు దుర్ఘటన జరిగిన వెంటనే ఎన్డీఆర్‌ఎఫ్‌ దళాలు అత్యంత వేగంగా అప్రమత్తం కావడంతో సుమారు 300 ప్రాణాలు నిలిచాయి. ఘటన జరిగిన నిమిషాల వ్యవధిలో 9 బృందాలు రంగంలోకి దిగాయి. అత్యంత వేగంగా ప్రాణా పాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న 300 మందిని ఆస్పత్రులకు తరలించడంతో ప్రాణాపా యం తప్పింది. ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలకు పోలీసు జాగిలాలు తోడ్పాటునందించాయి.

మరిన్ని వార్తలు