విద్యార్థి కోసం.. బస్‌టైమింగ్స్‌లో మార్పు..!

14 Jan, 2021 08:35 IST|Sakshi

బాగా చదువుకోవాలనే జిజ్ఞాస, కష్టపడి చదివే మనస్తత్వం ఉన్న విద్యార్థులకు ఏ సాయం కావాలన్నా తల్లిదండ్రుల నుంచి ప్రభుత్వాల వరకు అందరు సాయం చేసేవారే. స్కూల్‌ విద్యార్థి కోసం జపాన్‌ ప్రభుత్వం ఏకంగా స్పెషల్‌ ట్రైన్‌ను నడిపిన సంగతి తెలిసిందే. ఈ మధ్యకాలంలో ఒడిషాలోనూ ఇటువంటి ఘటనే చోటుచేసుకుంది. భువనేశ్వర్‌లోని స్థానిక ఎంబీఎస్‌ పబ్లిక్‌ స్కూల్‌లో ఏడో తరగతి చదువుతున్న సాయి అన్వేష్‌ అమృతం ప్రధాన్‌ రోజూ పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌లోనే స్కూల్‌కు వెళ్తుంటాడు. తన స్కూలు ఉదయం 7:30 నిమిషాలకే ప్రారంభం అవుతుంది. కానీ సాయి అన్వేష్‌ వెళ్లే బస్‌ మాత్రం 7:40 నిమిషాలకు వస్తుండడంతో డైలీ స్కూలుకు లేట్‌గా వెళ్లాల్సి వస్తోంది. ఫలితంగా టీచర్లతో చివాట్లు తినడంతోపాటు క్లాసులుకూడా మిస్‌ అవుతున్నాడు.

దీంతో విసిగిపోయిన సాయి అన్వేష్‌ ట్విట్టర్‌ వేదికగా క్యాపిటల్‌ రీజియన్‌ అర్బన్‌ ట్రాన్స్‌పోర్ట్‌(సీఆర్‌యూటీ) సంస్థ ఎండీ, ఐపీఎస్‌ అధికారి అరుణ్‌ బొత్రాను ట్యాగ్‌ చేస్తూ ‘‘బస్‌టైమింగ్స్‌ వల్ల పాఠశాలకు రోజూ లేటుగా వెళ్తున్నానీ.. మీరు దయతో నా ఇబ్బందిని అర్థం చేసుకుని,స్కూలుకు టైముకు చేరుకునేలా చర్యలు తీసుకోవాలని విన్నవించాడు’’. అతను సందేశం పంపిన కొన్నిగంటల్లోనే ఆ ఐఏఎస్‌ అధికారితోపాటు సీఆర్‌యూటీ స్పందించి త్వరలోనే బస్‌ టైమింగ్స్‌ మారుస్తామని హామీ ఇచ్చారు. దీంతో బస్‌ టైమింగ్‌ మారి సాయి అన్వేష్‌ స్కూల్‌కు టైముకు వెళ్లగలుగుతున్నాడు. తన మనవిని మన్నించినందుకు ట్రాన్స్‌పోర్ట్‌ ,ఐఏఎస్‌ అధికారికి అతను ధన్యవాదాలు తెలిపాడు. ఈ విషయం ఆనోటా ఈనోటా విన్నవారంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు