ప్రభుత్వాన్ని విమర్శిస్తే ఇక తాట తీసుడే

22 Jan, 2021 14:04 IST|Sakshi

పాట్నా: భావ ప్రకటన స్వేచ్ఛ హక్కు రాజ్యాంగంలో కల్పించారు. అయితే ఈ హక్కు ఉందని చెప్పి కొందరు ఇష్టారీతిన ప్రభుత్వాన్ని, ప్రజాప్రతినిధులను తీవ్రరూపంలో విమర్శించడం వివాదమవుతోంది. ఈ రకమైన విమర్శలు సామాజిక మాధ్యమాల వేదికగా తీవ్రంగా ఉంది. ఇది పలుసార్లు తీవ్ర వివాదాలకు దారి తీసే పరిస్థితి ఏర్పడింది. గతంలో ఇలాంటి ఘటనలు ఎన్నో చోటుచేసుకున్నాయి. ఇకపై ఇలాంటివి బిహార్‌లో చెల్లవు. ఈ మేరకు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి విమర్శలపై ఉక్కుపాదం మోపనుంది.

ఈ సందర్భంగా అన్ని విభాగాలకు నోటీసులు పంపించారు. ఇన్నాళ్లు వస్తున్న విమర్శలను సహించం. ఇకపై సహించబోమని ఐజీ నయ్యర్‌ హస్‌ నయిన్‌ ఖాన్‌ తెలిపారు. ప్రభుత్వం, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలపై వివాదాస్పద విమర్శలు.. అసభ్య మాటలు వస్తే చట్టం ప్రకారం నేరమని ఆయా విభాగ శాఖ అధికారులకు ఐజీ గుర్తుచేశారు. వారిపై చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉందని తెలిపారు. సంస్థలయినా.. వ్యక్తులైనా వారిపై కఠిన చర్యలు తీసుకోవచ్చని స్పష్టం చేశారు. వారిపై న్యాయపరమైన విచారణ చేసి శిక్ష విధించవచ్చని వివరించారు. ఈ మేరకు ఈనెల 21వ తేదీన ఐజీ ఆయా విభాగాల కార్యదర్శులకు లేఖ రాశారు. విమర్శించే వారిపై ఉక్కుపాదం మోపుతామని బిహార్‌ ప్రభుత్వం హెచ్చరించింది. ఇకపై సోషల్‌ మీడియాలోనైనా.. ఇక ఎక్కడైనా ఆచుతూచి మాట్లాడాలని పరోక్షంగా హితవు పలికింది. 

అయితే ఈ ఉత్తర్వులను ప్రతిపక్షాలు తప్పుపట్టాయి. విమర్శలకు బదులివ్వకుండా ప్రశ్నించే గొంతులను నొక్కేస్తున్నారని ఆర్జేడీ, జనతా దళ్‌ తెలిపాయి. నిర్వేదంతో ఈ నిర్ణయం తీసుకుందని పేర్కొన్నాయి.

మరిన్ని వార్తలు