వాన దేవునిపై ఫిర్యాదు.. వైరలవుతోన్న లేఖ

18 Jul, 2022 21:01 IST|Sakshi

కలెక్టర్‌కు రెవెన్యూ అధికారి సిఫార్సు

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో చాలా ప్రాంతాలు వర్షాభావంతో అల్లాడుతున్నాయి. దాంతో సకాలంలో వానలు కురిపించని వరుణుడిపై, అతనికి ఆ మేరకు ఆదేశాలివ్వని ఇంద్రుడిపై చర్యలు తీసుకోవాలని ఎన్‌ఎన్‌ వర్మ అనే ఓ రెవెన్యూ అధికారి తీర్మానించాడు! ఈ మేరకు ఏకంగా జిల్లా కలెక్టర్‌కే సిఫార్సు చేశాడు!! జరిగిందేమిటంటే...వర్షాభావానికి ఇంద్రుడు, వరుణుడే బాధ్యులని ఆరోపిస్తూ ఫిర్యాదుల స్వీకరణ దినం (సమాధాన్‌ దివస్‌) సందర్భంగా గోండా జిల్లాకు చెందిన సుమిత్‌కుమార్‌ యాదవ్‌ అనే రైతు వర్మకు లేఖ ఇచ్చాడు.

జిల్లాలో వర్షపాతం తక్కువగా ఉండడం వల్ల జనజీవనంపై ప్రతికూల ప్రభావం పడిందని యాదవ్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. వర్షాభావ పరిస్థితులపై ఇద్రుడిని నిందిస్తూ ఇలా లేఖ రాశారు. చాలా నెలలుగా వర్షాలు పడలేదని గౌరవనీయమైన అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరుకుంటున్నాను. కరువు కాటకాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితి జంతువులు, వ్యవసాయంపై కూడా ప్రతికూల ప్రభావాలను కలిగిస్తుంది. దీంతో ఆయా కుటుంబాల్లోని మహిళలు, చిన్నారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కావున, ఈ విషయంలో వరుణుడిపై తగు చర్యలు తీసుకుని బాధ్యత వహించవలసిందిగా కోరుతున్నాము.’ అని పేర్కొన్నాడు.

ఇంతో ఎన్‌ఎన్‌ వర్మ .. లేఖను పూర్తిగా చదవకుండానే ‘బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవా’లని సిఫార్సు చేస్తూ ఆ లేఖను ఏకంగా కలెక్టర్‌ కార్యాలయానికి పంపాడు. అదిప్పుడు సోషల్‌ మీడియాలో వైరలైంది. దాంతో నాలుక్కరుచున్న వర్మ, తానసలు ఆ లేఖ పంపనే లేదు పొమ్మని బుకాయిస్తున్నాడు. సమాధాన్‌ దివస్‌లో వందలాది ఫిర్యాదులు వస్తుంటాయి గనుక బహుశా చదవకుండానే లేఖను ఫార్వర్డ్‌ చేసి చిక్కుల్లో పడ్డాడని అధికారులు అంటున్నారు. ఇంతకూ ఇంద్ర వరుణులపై కలెక్టర్‌ ఏం చర్యలు తీసుకుంటారో చూడాలంటూ నెటిజన్లు హాస్యం పండిస్తున్నారు.

మరిన్ని వార్తలు