అవకతవకలు గుర్తించాం.. బీబీసీలో సర్వేపై ఐటీ అధికారుల ప్రకటన!

17 Feb, 2023 18:29 IST|Sakshi

సాక్షి, ఢిల్లీ: ప్రముఖ మీడియా సంస్థ బీబీసీ ఆఫీసుల్లో జరుగుతున్న సర్వేపై ఐటీ శాఖ శుక్రవారం సాయంత్రం అధికారిక ప్రకటన చేసింది.  ట్యాక్స్‌ చెల్లింపుల్లో అవకతవకలు గుర్తించామని, ఇందుకు సంబంధించి ఆధారాలు సైతం సేకరించామని పేర్కొంది. అవి ఐటీ దాడులు, సోదాలు కాదని.. కేవలం సర్వేనే అని ఇంతకుముందు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే బీబీసీ పేరును ప్రస్తావించకుండానే.. ఓ ప్రముఖ మీడియా సంస్థ అని పేర్కొంటూ సదరు సంస్థ లావాదేవీలపై సర్వే చేసినట్లు, అకౌంటింగ్ పుస్తకాల్లో అక్రమాలను గుర్తించినట్లు తాజాగా భారత ఆదాయపు పన్ను శాఖ ప్రకటించింది.

ముంబై, ఢిల్లీ కార్యాయాలల్లో చేసిన ఈ సర్వేల్లో ప్రధానంగా  లావాదేవీల డాక్యుమెంట్స్‌ పరిశీలించామని.. ఎలక్ట్రానిక్‌ పరికరాలు, కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు ఐటీ అధికారులు తెలిపారు. ప్రముఖ అంతర్జాతీయ మీడియా సంస్థలో వివిధ విభాగాలు వెల్లడించిన ఆదాయం, లాభాలు భారతదేశంలో వాళ్ల కార్యకలాపాల స్థాయికి అనుగుణంగా లేవు అని ఆదాయపు పన్ను శాఖ సదరు ప్రకటనలో పేర్కొంది. అంతేకాదు మీడియా సంస్థలోని ఉద్యోగుల స్టేట్‌మెంట్‌లు, డిజిటల్ ఫైల్‌లు, డాక్యుమెంట్‌లను పరిశీలించే ప్రక్రియలో ఇంకా కొనసాగుతోందని ప్రకటించింది. తమ దర్యాప్తును ఆలస్యం చేసేందుకు సిబ్బంది ప్రయత్నించినట్లు కూడా ఆరోపించింది ఐటీ శాఖ.  అయితే ఈ ఆరోపణలపై బీబీసీ ఇంకా స్పందించాల్సి ఉంది.

సదరు వార్తా సంస్థకు నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయి.. ఈ నిధులు ఎలా ఖర్చు పెడుతున్నారు? ఇంకా ఏమైనా ఉందా? అనే కోణంలోనే సర్వే చేసినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే బీబీసీ ఆఫీసుల్లో మొదటి రెండు రోజులపాటు.. లోపలికి ఉద్యోగులను అనుమతించలేదు. లోపల ఉన్నవాళ్లను బయటకు పంపలేదు. మూడవ రోజు నుంచి ఉద్యోగులకు కార్యకలాపాలకు అనుమతించింది. అయితే

అకౌంట్స్‌, అడ్మినిస్ట్రేషన్‌ విభాగాలను మాత్రం ఐటీ శాఖ తమ ఆధీనంలో ఉంచుకుంది. ఆయా విభాగాల్లో వాళ్లను ప్రశ్నించడంతో పాటు పత్రాలతో పాటు కంప్యూటర్‌ల్లో ఉన్న డాక్యుమెంట్లను కూడా ఐటీ శాఖ తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. బీబీసీ భారత ప్రధాని మోదీని ఉద్దేశిస్తూ గుజరాత్‌ అల్లర్ల ప్రధానాశాంగా ఓ డాక్యుమెంటరీని రూపొందించగా.. అది దుమారం రేపింది. ఈ తరుణంలో బీబీసీ కార్యాలయాల్లో తనిఖీలపై రాజకీయంగానూ  చర్చ జరిగిన సంగతి తెలిసిందే. 

మరిన్ని వార్తలు