28 ఏళ్ల క్రితం పాక్‌ వెళ్లిన వ్యక్తి..

17 Nov, 2020 13:53 IST|Sakshi

గూఢచర్యం ఆరోపణలపై ఎనిమిదేళ్లు జైలులో

లక్నో: 28 ఏళ్ల క్రితం పాకిస్తాన్‌ వెళ్లి.. గూఢచర్యం ఆరోపణల కింద దాదాపు 8 ఏళ్ల పాటు కరాచీ‌ జైల్లో గడిపి భారత్‌కు తిరిగి వచ్చిన వ్యక్తికి స్థానికులు, పోలీసులు పూల మాలలతో స్వాగతం పలికారు. స్వదేశంలో తనకు లభించిన ఆత్మీయత, ఆదరణ చూసి ఆ వ్యక్తి ఏకధాటిగా కన్నీరు కార్చాడు. అనవసరంగా పాకిస్తాన్‌ వెళ్లాను. వారు మనల్ని శత్రువులుగా చూస్తారు అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. వివరాలు.. కాన్పూర్‌కు చెందిన షంసుద్దీన్(70) 1992లో 90 రోజుల వీసా మీద పాకిస్తాన్‌ వెళ్లాడు. ఆ తర్వాత 1994లో పాక్‌ పౌరసత్వం పొంది అ‍క్కడే స్థిరపడ్డాడు. కొన్నేళ్లు బాగానే గడిచింది. ఆ తర్వాత 2012లో గూఢచర్యం ఆరోపణలపై పాక్‌ అధికారులు అతడిని అరెస్ట్‌ చేసి కరాచీ జైలులో ఉంచారు. దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత ఈ ఏడాది అక్టోబర్‌ 26న విడుదల అయ్యాడు. అత్తారీ-వాగా సరిహద్దు ద్వారా భారతదేశానికి చేరుకున్నాడు. కోవిడ్‌-19 వ్యాప్తి నేపథ్యంలో అమృత్‌సర్‌లో 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉన్నాడు. 

అనంతరం నగరంలోని బజారియా పోలీస్‌స్టేషన్‌ సర్కిల్ ఆఫీసర్ తిర్పురారీ పాండే, షంసుద్దీన్‌కు పూల మాలతో స్వాగతం పలికారు. అనంతరం పోలీసులు అతన్ని కంఘి-మోహల్‌లోని తన ఇంటికి తీసుకెళ్లారు. ఆయన రాక కోసం ప్రజలు అక్కడ గుమిగూడారు. జనం అతనిని చుట్టుముట్టి పూల మాలలు వేసి కౌగిలించుకున్నారు. దశాబ్దాల తరువాత స్వదేశానికి తిరిగి వచ్చినందుకు ఆయనను అభినందించారు. దాదాపు 28 ఏళ్ల పాటు సొంత దేశానికి, పుట్టిన వారికి, ఇంటికి దూరంగా ఉన్న షంసుద్దీన్‌ స్వస్థలం చేరుకోగానే తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. ఆత్మీయులను చూసి ఆనందంతో ఏడ్చేశాడు. (చదవండి: మాజీ సైంటిస్ట్‌కు 1.3 కోట్ల పరిహారం)

అనంతరం షంసుద్దీన్‌ మాట్లాడుతూ.. ‘పాకిస్తాన్‌లో భారతీయులను చాలా నీచంగా చూస్తారు’ అని మీడియాతో తెలిపాడు. "వారు మనల్ని శత్రువుల్లా చూస్తారు. పాకిస్తాన్‌లో లంచం, అవినీతి భారీ ఎత్తున ఉంది" అన్నారు. అంతేకాక పాక్‌ వెళ్లి చాలా పెద్ద తప్పు చేశాను. అక్కడే చనిపోతానేమో అనుకున్నాను. కానీ అదృష్టం బాగుండి బతికుండగానే నా వారి దగ్గరకు వచ్చాను అని కన్నీటి పర్యంతమయ్యాడు. 

మరిన్ని వార్తలు