8 కిలోల బరువు.. నాగుపాము డిజైన్‌

30 Mar, 2022 19:11 IST|Sakshi
కోరప్పా కెకరే, ఆయన చెప్పులు..

సాతారాలో వింత పాదరక్షలతో వార్తల్లోకి ఎక్కిన వృద్ధుడు 

సాక్షి ముంబై: సాతారా జిల్లాకి చెందిన 60 ఏళ్ల వృద్ధుడైన ఓ గొర్రెల కాపరి చెప్పులు ఇప్పుడు  వార్తల్లోకెక్కాయి. ఈయన కాళ్లకు వేసుకునే చెప్పులు ఎనిమిది కిలోల బరువుతోపాటు నాగుపాము పడగ రూపంలోని ప్రత్యేక డిజైన్‌లో, బంగారు రంగులో ఉండటంతో ఈ చెప్పులు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఇలా అనేక ప్రత్యేకతలతో ఉన్న ఈ చెప్పులు రూ. 31 వేల విలువ ఉంటాయని ఆయన అంటున్నారు. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ఈ పాదరక్షలు హల్‌చల్‌ చేస్తున్నాయి. సాతారా జిల్లా మాణ్‌ తాలూకాలోని జాంభుళణీ గ్రామంలో వృత్తి రీత్యా గొర్రెల కాపరి అయిన కెరాప్పా కోకరే ఈ చెప్పులు తయారు చేయించుకున్నారు.

పొలాల్లో, కాలిబాటల్లో అత్యధిక సమయం గడిపే ఆయన వేషధారణ సైతం ప్రత్యేకంగా ఉంది. ధోతీ, చొక్కా, నెత్తిపై పసుపు రంగులో ఉండే పంచెతో కట్టిన తలపాగా (పగిడి)తోపాటు గ్రామీణ వస్త్రధారణతో ఆయన అందరినీ ఆకట్టుకుంటున్నారు. ముఖ్యంగా ఈ పరిసరాల్లో జరిగే ‘గాజీ’ నృత్య ప్రదర్శనలో కెరప్పా కోకరే ఈ చెప్పలు వేసుకుని చిందులు వేసి అందరినీ ఆకట్టుకుంటున్నారు. ఈ చెప్పులను ఆయన ప్రత్యేకంగా ఆక్లూజ్‌లో తయారు చేయించుకున్నారు. కెరప్పా కొకరే ధరించే ఈ చెప్పులలో 100 ఎల్‌ఈడీ లైట్లు, గోండాలు, 100 గజ్జెలు, నట్‌బోల్టులు, గాజు బిళ్లలు, బ్యాటరీ తదితరాలున్నాయి.

చదవండి: ('ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్ హత్యకు కుట్ర')

ముఖ్యంగా బంగారు రంగులో ఉండే ఈ చెప్పులు, ఉదయం, రాత్రి సమయాల్లో వైవిధ్యంగా కనిపిస్తూ అందరినీ ప్రత్యేకంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ చెప్పుల కారణంగా కోకరే కెరప్పా తన గ్రామంతోపాటు చుట్టుపక్కల గ్రామాల్లో కూడా చర్చల్లోకెక్కారు. అదేవిధంగా సోషల్‌ మీడియాలోనూ హల్‌చల్‌ చేస్తున్నారు. 15 ఏళ్ల వయసు నుంచే కోకరే కొరప్పాకు చెప్పులతోపాటు ప్రత్యేక వేషధారణ అంటే చాలా ఇష్టం. అందుకే ఆయన 60 ఏళ్ల వయసులో కూడా చెప్పులు, వేషధారణ అంతా ప్రత్యేకంగా ఉండేలా చూసుకుంటారు. స్వగ్రామంతోపాటు చుట్టుపక్కల గ్రామాల్లో జరిగే కార్యక్రమాలలో ఆయన ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. ముఖ్యంగా గాజి నృత్య ప్రదర్శనలో తనదైన నృత్యరీతిలో అందరినీ ఆకట్టుకుంటారు. ముఖ్యంగా ఇప్పుడు ఎనిమిది కిలోల బరువుతో, రూ. 31 వేల విలువైన ప్రత్యేక పాదరక్షలతో ఓ సెలబ్రిటీ అయిపోయారు. 

మరిన్ని వార్తలు