106 ఏళ్ల వయసులో కరోనాను జయించిన బామ్మ

20 Sep, 2020 20:26 IST|Sakshi

ముంబై : కరోనా వైరస్‌ సోకగానే డీలా పడే వారిలో ధైర్యం నింపే ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. 106 ఏళ్ల వయసులో మహమ్మారి బారినపడి వ్యాధి నుంచి వేగంగా కోలుకున్న బామ్మ ఉదంతం అందరిలో స్ఫూర్తి నింపుతోంది.థానే జిల్లాలో 106 సంవత్సరాల వృద్ధురాలు కరోనా వైరస్‌ను జయించి వైద్యులు, నర్సుల అభినందనల మధ్య ఆదివారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. పదిరోజుల పాటు కోవిడ్‌-19కు చికిత్స పొందిన బామ్మ చిరునవ్వుతో ఆస్పత్రి నుంచి బయటకు వస్తూ తన డిశ్చార్జి సర్టిఫికెట్‌ను మీడియాకు ప్రదర్శించారు. అంతకుముందు వందేళ్లు  పైబడిన మహిళను కరోనా చికిత్స అందించేందుకు పలు ఆస్పత్రులు నిరాకరించాయని, ఎట్టకేలకు ఆమె ఇప్పుడు వ్యాధిని జయించి ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అవుతుండటం సంతోషకరమని వృద్ధురాలి కోడలు పేర్కొన్నారు. పదిరోజుల కిందట తమ అత్తగారిని కళ్యాణ్‌ డొంబివిలి మున్పిపల్‌ కార్పొరేషన్‌ పరిథిలోని ఓ కోవిడ్‌ సెంటర్‌లో చేర్చుకుని చికిత్స అందించడంతో ఆమె ఆరోగ్యం కుదుటపడిందని చెప్పారు.

వృద్ధురాలికి మెరుగైన చికిత్స అందించి ఆమె కోలుకునేందుకు కృషి చేసిన వైద్య సిబ్బందిని కోవిడ్‌-19 కేంద్రాన్ని నిర్వహించే ‘ఒక రూపాయి ఆస్పత్రి’ ఎండీ డాక్టర్‌ రాహుల్‌ గులే అభినందించారు. జులై 27న తాము ఈ ఆస్పత్రిని ప్రారంభించామని, అప్పటి నుంచి 1100 మంది కోవిడ్‌-19 రోగులకు చికిత్స అందించామని చెప్పారు. రైలు ప్రమాదాల బాధితులకు తక్షణ సాయం అందించేందుకు ఎంపిక చేసిన కేంద్రాల్లో రూపాయి ఆస్పత్రులను సెంట్రల్‌ రైల్వే ప్రారంభించింది. కరోనాను జయించిన వృద్ధురాలి ఉదంతంపై మహారాష్ట్ర మంత్రి ఆదిత్యా ఠాక్రే స్పందించారు. వృద్ధురాలికి మెరుగైన చికిత్స అందించిన ఆస్పత్రి నిర్వాహకులు, వైద్యులతో పాటు శివసేన స్థానిక ఎంపీ శ్రీకాంత్‌ షిండేను ఆయన అభినందించారు. చదవండి : 'పాప‌డ్‌'లు తిని క‌రోనా నుంచి కోలుకున్నారా?

మరిన్ని వార్తలు