రండి రండి.. అరుదైన అతిథులు వస్తున్నారోచ్‌!

5 Apr, 2022 07:37 IST|Sakshi

తాబేళ్ల రాకతో రుషికుల్య నదీతీరంలో సందడి 

రికార్డు స్థాయిలో 5,48,768 గుడ్లు పెట్టిన ఉభయచరాలు 

45 రోజుల్లో గుడ్లు పొదగవచ్చని అంచనా 

ప్రత్యేక రక్షణ చర్యలు ప్రారంభించిన అటవీశాఖ

ఎల్లలు లేని సాగరంలో జీవించే ఉభయచర జీవులు వడివడిగా పుట్టింటి వైపు అడుగులు వేస్తున్నాయి. అరుదైన ఈ అతిథుల ఆగమనంతో రుషికుల్య తీరం ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. తమ సంతానవృద్ధికి అర్ధరాత్రి దాటిన తరువాత తీరానికి చేరుకుంటున్న ఆలివ్‌రిడ్లేలు.. గుడ్లు పెట్టి, వాటిని ఇసుకలో భద్ర పరిచిన అనంతరం సంద్రంలోకి తిరిగి చేరుకుంటున్నాయ. వీటి రాకతో తీరమంతా సందడి నెలకొంది. – భువనేశ్వర్‌ 

భువనేశ్వర్‌: గుడ్లు పెట్టేందుకు ఏటా రుషికుల్య తీరానికి ఆలివ్‌రిడ్లే తాబేళ్లు అతిథులుగా విచ్చేయడం పర్యావరణ ప్రియులకు ఆహ్లాదపరుస్తోంది. ఈ ఏడాది రికార్డు స్థాయిలో 5,48,768 తాబేళ్లు ఈ తీరానికి చేరడం విశేషం. 2018లో అత్యధికంగా 4,82,128 ఆలివ్‌రిడ్లే ఈ ప్రాంతానికి విచ్చేశాయి. మార్చి 27 నుంచి రుషికుల్య తీరంలో తాబేళ్లు గుడ్లు పొదగడం ప్రారంభమైంది. ఈనెల 3తో ముగిసిందని డీఎఫ్‌ఓ అమ్లాన్‌ నాయక్‌ తెలిపారు. మరో 45 రోజుల్లో ఈ గుడ్ల నుంచి పిల్లలు బయటకు వస్తాయని అంచనా వేస్తున్నట్లు పేర్కొన్నారు.  

ప్రత్యేక జాగ్రత్తలు.. 
అపురూపమైన ఆలివ్‌ రిడ్లే తాబేళ్ల ఆగమనం పురస్కరించుకుని రుషికుల్య తీరంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సువిశాల తీరాన్ని 50 సెగ్మెంట్లుగా విభజించారు. గుడ్లు పెట్టేందుకు అనుకూలమైన పర్యావరణంతో ఈ సెగ్మెంట్లు ఏర్పాటు చేయడం విశేషం. తాబేళ్ల గుడ్లని కుక్కలు, కాకులు, ఇతర పక్షలు నష్ట పరచకుండా ప్రత్యేక సంరక్షణ చర్యలు చేపడుతున్నారు. పొదిగిన గుడ్లు నుంచి బయటపడిన ఆలివ్‌ రిడ్లే తాబేళ్ల కొత్త సంతతి సురక్షితంగా తిరిగి సముద్ర గర్భానికి వెళ్లేంత వరకు ఈ కార్యాచరణ నిరవధికంగా కొనసాగుతుందని డీఎఫ్‌ఓ వివరించారు.

చదవండి: కట్నంతో లాభాలెన్నో!

      

మరిన్ని వార్తలు