ట్రోల్స్‌ వల్ల కాస్త మంచి కూడా జరిగింది: అంజలి బిర్లా

21 Jan, 2021 20:31 IST|Sakshi
లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా కుమార్తె అంజలి బిర్లా(ఫొటో కర్టెసీ: ఎన్డీటీవీ)

న్యూఢిల్లీ: ‘‘ అవాస్తవాలు ప్రచారం చేసే వారి జాడ కనిపెట్టి వారిని జవాబుదారులుగా నిలబెట్టాలి. ఈరోజు నేను బాధితురాలిని అయ్యాను. రేపు మరొకరు. ట్రోలింగ్‌కు వ్యతిరేకంగా ఓ చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉంది’’ అని లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా తనయ అంజలి బిర్లా అభిప్రాయపడ్డారు. అయితే ట్రోల్స్‌ వల్ల తనకు కాస్త మంచే జరిగిందని, భవిష్యత్తులో ఇలాంటి వాళ్లను దీటుగా ఎదుర్కోగలననే నమ్మకం వచ్చిందని తెలిపారు. కాగా అంజలి బిర్లా  ఇటీవల ఐఏఎస్‌గా ఎంపికైన విషయం తెలిసిందే. అయితే తన తండ్రి పదవిని అడ్డుపెట్టుకుని అత్యున్నత ఉద్యోగాన్ని పొందారంటూ కొంతమంది ఆమెపై విషం చిమ్మారు. ప్రతిభ లేకపోయినా.. పరీక్ష రాయకుండానే జాబ్‌ సంపాదించారంటూ సోషల్‌ మీడియలో విద్వేషపూరిత కామెంట్లు చేశారు.

కాగా వాస్తవానికి ఆమె పరీక్షలు రాసి ఇంటర్వ్యూ కూడా పూర్తి చేసి ఐఏఎస్‌కు ఎంపికయ్యారు. ఫ్యాక్ట్‌ చెక్‌(నిజనిర్ధారణ) సంస్థ ఈ విషయాన్ని వెల్లడించింది. అయినప్పటికీ కొంతమంది ఆకతాయిలు అంజలి గురించి అసత్యాలు ప్రచారం చేస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో గురువారం ఓ జాతీయ మీడియాతో మాట్లాడిన అంజలి బిర్లా.. ‘‘ఎంతో కష్టపడి చదివి పరీక్షలు రాసి ఉద్యోగం పొందానని నేను వివరణ ఇవ్వాల్సి వచ్చింది. అయితే ప్రతికూల కామెంట్ల వలన నా మనసు దృఢంగా తయారైంది. నేను ఎల్లప్పుడూ నిజాయితీగా ఉంటాను. నేనెంతగా హార్డ్‌వర్క్‌ చేస్తానో.. నాతో సన్నిహితంగా ఉండేవారికి మాత్రమే తెలుసు.

నిజానికి మున్ముందు జీవితంలో ఎన్నో సవాళ్లు ఎదురవుతాయి. అయితే ట్రోల్స్‌ కారణంగా పూర్తిస్థాయిలో పరిణతి చెందిన వ్యక్తిగా రూపాంతరం చెందాను’’అని చెప్పుకొచ్చారు. కాగా సోషల్‌ మీడియాలో తనను టార్గెట్‌ చేసిన వారికి.. అంజలి బిర్లా ఇప్పటికే కౌంటర్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. యూపీఎస్సీ పరీక్షల ప్రక్రియ నిష్పక్షపాతంగా జరుగుతుందని, కనీసం వ్యవస్థలనైనా గౌరవించాలంటూ హితవు పలికారు. ఇందుకు సంబంధించిన పోస్టుకు తన ఉత్తీరణ పత్రాలను కూడా జోడించారు. (చదవండి: ఐఏఎస్‌గా అడ్డదారిలో ఎంపిక కాలే!)

మరిన్ని వార్తలు