రాహల్‌ జోడో యాత్రకు సడెన్‌ బ్రేక్‌! కేవలం కిలోమీటర్‌ తర్వాతే..

27 Jan, 2023 14:52 IST|Sakshi

కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌​ గాంధీ చేపట్టి భారత్‌ జోడో యాత్ర ముగింపు దశకు చేరుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం జమ్ముకాశ్మీర్‌లోని బనిహాల్‌లో సాగుతున్న రాహుల్‌ యాత్రలో నేషనల్‌ కాన్ఫరెన్స్‌(ఎన్‌పీ) నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దల్లా పాల్గొన్నారు. ఈ మేరకు ఒమర్‌ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... ఈ భారత్‌ జోడో యాత్ర రాహుల్‌ గాంధీ ఇమేజ్‌ను పెంచడం కోసం కాదని, దేశంలోని పరిస్థితిని మార్చడం కోసమేనని చెప్పారు. అందువల్లే తాను ఈ యాత్రలో పాల్గొన్నట్లు వివరించారు.

ఈ యాత్రను గాంధీ వ్యక్తిగత కారణాలతో ప్రారంభించలేదని, మతపరమైన ఉద్రిక్తతలు సృష్టించి, మైనారిటీలను లక్ష్యంగా చేసుకునే ప్రయత్నాలపై జరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో చేస్తున్న యాత్రగా అభివర్ణించారు. ఈ ప్రభుత్వం అరబ్‌ దేశాలతో స్నేహం చేస్తున్నప్పటికీ దేశంలోని అతిపెద్ద మైనారిటీ నుంచి ఒక్కరూ కూడా ప్రభుత్వంలో ప్రతినిధులుగా లేరని చెప్పారు.

ఆర్టికల్‌ 370 రద్దు గురించి ప్రస్తావిస్తూ..దీని పునరుద్ధణ కోసం కోర్టులో  పోరాడతాం అన్నారు. ఈ సందర్భంలో ఆ రాష్ట్రంలోని ఎన్నికలు జరిగి ఎనిమిదేళ్లు పూర్తయిందని, చివరి అసెంబ్లీ ఎన్నికలు 2014లో జరిగాయన్నారు. రెండు ఎన్నికల మధ్య ఈ గ్యాప్‌ చాలా ఎక్కువే అని చెప్పారు. తీవ్రవాదం ఉధృతంగా ఉన్నప్పుడూ కూడా జరగలేదన్నారు. ఈ ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్‌ ప్రజలను ఎన్నికలు కోసం అడుక్కోవాలని కోరుకుంటోందని అన్నారు. అయినా తాము బిచ్చగాళ్లం కాదని దాని కోసం తాము అడుక్కోమని తేల్చి చెప్పారు. కాగా ఈ యాత్రలో ఇరు నాయకులు ఒకేలాంటి టీషర్ట్‌ల ధరించి అందర్నీ ఆశ్చర్యపరిచారు.

యాత్రకు బ్రేక్‌
చక్కగా సాగిసోతున్న రాహుల్‌ జోడో యాత్రకు సడెన్‌ బ్రేక్‌ పడింది. ఆయన భద్రతా దృష్ట్యా అనుహ్యంగా రద్దైంది. ఈ రోజు రాహుల్‌ జోడో యాత్రలో 11 కిలోమీటర్లు నడవాల్సి ఉండగా ..కేవలం కిలోమీటర్‌ తర్వాత ఆగిపోవాల్సి వచ్చింది. ఐతే కాశ్మీర్‌లో ఆయన కోసం ఊహించని విధంగా ప్రజలు ఎదురు చూస్తున్నట్లు కాంగ్రెస్‌ నేతలు చెబుతున్నారు. భద్రతా సిబ్బందిని ఆకస్మికంగా ఉపసంహరించుకోవడంతో తీవ్రమైన భద్రతా ఉల్లంఘనకు కారణమైందని కాంగ్రెస్‌ వర్గాలు ఆరోపణలు చేశాయి.

రాహుల్‌ శ్రీనగర్‌కు సమీపంలోని బనిహాల్‌ ​టన్నెల్‌ దాటిన తర్వాత పెద్ద ఎత్తున భారీ జన సముహం రావడంతో దాదాపు 30 నిమిషాల పాటు రాహుల్‌ కదలేకపోయినట్లు తెలిపాయి, అదీగాక అక్కడ తగిన విధంగా భద్రత లేకపోవడంతోనే యాత్ర ఆపేయవలసి వచ్చినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలోనే గాంధీని భద్రతా వాహనంలో తీసుకెళ్లి యాత్రను విరమింపజేసినట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. వాస్తవానికి ఈ యాత్రలో రాహుల్‌ గాంధీ, ఒమర్‌ అబ్దుల్లాల భద్రతకు సంబంధించి తగిన సంఖ్యలో పోలీసుల లేరని, తీవ్రమైన భద్రతా లోపాలు ఉన్నట్లు సమాచారం.
 

(చదవండి: ప్రధాని మోదీని ప్రశ్నించిన తెలంగాణ విద్యార్థిని)

మరిన్ని వార్తలు