భారత్‌లో ఒమిక్రాన్‌ సామాజిక వ్యాప్తి స్థాయికి చేరుకుంది: ఇన్సాకాగ్‌

23 Jan, 2022 13:14 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఒమిక్రాన్‌ కేసుల పెరుగుదలపై ఇండియన్‌ సార్స్‌–కోవ్‌–2 జెనోమిక్స్‌ కన్సార్టియం (ఇన్సాకాగ్‌) కీలక అప్‌డేట్‌ ఇచ్చింది. దేశంలో ఒమిక్రాన్‌​ సామాజిక వ్యాప్తి స్థాయికి చేరుకుందని తెలిపింది. ఢిల్లీ, ముంబయి నగరాల్లో ఈ వేరియంట్‌ విస్తృతంగా వ్యాప్తి చెందుతోందని వెల్లడించింది. విదేశీ ప్రయాణికుల నుంచి వ్యాపించే దానికన్నా దేశీయంగా అంతర్గత వ్యాప్తే అధికంగా ఉన్నట్లు ఇన్సాకాగ్‌ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. వ్యాక్సిన్‌ పొందిన ప్రయాణికుల్లో తొలుత ఒమిక్రాన్‌ వేరియంట్‌ను గుర్తించారు.

ఈ వేరియంట్‌ సోకినా ప్రస్తుతం చాలా మందిలో వైరస్‌ లక్షణాలు బహిర్గతం కావడంలేదు. మరి కొందరిలో స్వల్ప స్థాయి లక్షణాలే కనిపిస్తున్నాయి. వ్యాప్తి తీవ్రత అధికంగా ఉన్నప్పటికీ, ఆసుపత్రుల్లో చేరాల్సిన అవసరం తక్కువేనని, ప్రాణాపాయ ముప్పు కూడా స్వల్పమేనని ఇన్సాకాగ్‌ పేర్కొంది. అంతమాత్రాన ఒమిక్రాన్‌ను నిర్లక్ష్యం చేయడం తగదని, తగు రక్షణ విధానాలను పాటించాల్సిందేనని స్పష్టంచేసింది.
(చదవండి: కరోనా పాజిటివ్‌ కేసుల్లో 90 శాతం ఒమిక్రాన్‌ వేరియంట్‌వే)

భారీగా కేసులు
ఇక గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 3,33,533 మందికి కోవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో మొత్తం యాక్టివ్‌ కేసుల సంఖ్య 21,87,205 కు పెరిగింది. రెండో వేవ్‌ (35 లక్షలకు పైగా యాక్టివ్‌ కేసులు) తర్వాత ఈ స్థాయిలో యాక్టివ్‌ కేసులు ఉండటం ఇదే తొలిసారి. వైరస్‌ బాధితుల్లో తాజాగా 525 మంది ప్రాణాలు విడిచారు. ఇందులో అత్యధికంగా కేరళ నుంచి 132 మంది, మహారాష్ట్ర నుంచి 48  మంది బాధితులు ఉన్నారు. గత 24 గంటల్లో 2,59,168 మంది కోలుకున్నారు. పాజిటివిటీ రేటు 17.78 శాతంగా ఉండగా.. రికవరీ రేటు 93.18 శాతంగా ఉంది. మొత్తం కేసుల్లో యాక్టివ్‌ కేసుల 5.57 శాతం. ఈమేరకు కేంద్ర ఆరోగ్య శాఖ ఆదివారం నాటి బులెటిన్‌లో పేర్కొంది.
(చదవండి: పిల్లల్ని బడికి పంపించేది లేదు! )

మరిన్ని వార్తలు