Omicron impact: పెళ్లిళ్లపై ఒమిక్రాన్‌ పంజా, వ్యాపారం కుదేలు!

4 Jan, 2022 17:26 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పెళ్లిళ్లు, ఫంక్షన్లపై కరోనా మహమ్మారి మరోసారి ప్రభావం చూపనుందా? 2021లో పెళ్లి ముహూర్తాలు జోరుగా సాగాయన్న  సంతోషం ఎంతో కాలం నిలవకముందే  తాజాగా ఒమిక్రాన్‌ పంజా విసురుతోంది. దీంతో పెళ్లి వాయిదా వేసుకోవాలా? వద్దా , గెస్ట్‌ల్లో ఎవర్ని తగ్గించాలి రా బాబూ అనే మీమాంసలో పడిపోయారు జనం. మరోవైపు  ఈ కల్లోలంతో పెళ్లిళ్ల సీజన్‌ కోసం ముస్తాబవుతున్న ఫంక్షన్‌ హాల్స్‌ వెలవెలబోనున్నాయనే భయం బిజినెస్‌ వర్గాలను వెంటాడుతోంది. ఈ సీజన్‌పై ఆధారపడ్డ ఇతర వ్యాపారస్తుల పరిస్థితి ఏంటి?  నిపుణులు ఏమంటున్నారు.  

అలనాటి రామచంద్రుడి కన్నింటాసాటి అనే మురారి సినిమాలోని పెళ్లి పాట గుర్తుందా.. బ్యాండ్ బాజా బారాత్  అంటూ ఆ లెవల్లో పెళ్లి చేసుకోవాలని ఈ కాలపు పెళ్లీడు పిల్లలు ముచ్చపడుతుంటారు. అలాగే ఆకాశమంత పందిరి, భూదేవి అంతపీట వేసి బంధుమిత్రుల సమక్షంలో అంగరంగ వైభోగంగా పెళ్లి వేడుకను సంబరంగా జరిపించాలని పేరెంట్స్‌  కూడా కోరుకుంటారు. అయితే కరోనా ఎంటర్ అయినప్పటి నుంచి ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఏ క్షణంలో కేసులు పెరుగుతాయో..ఏ నిమిషంలో ఎలాంటి ఆంక్షలు అమల్లోకి వస్తాయో  తెలియని గందరగోళ పరిస్థితి 2022లో కూడా వెంటాడుతోంది. 

 జనవరి -మార్చి నెలల కాలాన్ని  శుభప్రదమైన పెళ్లిళ్ల సీజన్‌గా భావిస్తాం. పరిశ్రమ అంచనాల ప్రకారం జనవరి 14, మార్చి 31 కాలంలో  30 లక్షల  ముహూర్తాలు ఖరారైనాయి.  తద్వారా దాదాపు  రూ. 4 లక్షల కోట్ల వ్యాపారం జరగనుందని భావించారు. దీంతో డిమాండ్‌కు తగ్గట్టుగా వ్యాపారులు కూడా ఏర్పాట్లు చేసుకున్నారు.  ముఖ్యంగా హైదరాబాద్‌, ముంబై, ఢిల్లీతో సహా దేశవ్యాప్తంగా ఉన్న బాంక్వెట్ హాళ్లు, హోటళ్లు, మ్యారేజ్ లాన్‌లు, ఫామ్‌హౌస్‌లు తదితరాలు పూర్తి స్థాయిలో ముస్తాబయ్యాయి. అంతేనా ఫైవ్ స్టార్ హోటల్స్‌, క్యాటరింగ్, డెకరేషన్, క్రాకరీ, లాజిస్టిక్స్, వీడియోగ్రాఫర్‌లు, బ్యాండ్‌లు, డీజేలు, లైటింగ్,  టెంట్లు,  ఇలా ఎండ్-టు-ఎండ్ వెడ్డింగ్ సొల్యూషన్స్‌ సంస్థలు, ఈవెంట్ మేనేజ్‌మెంట్ సంస్థలు  కూడా  చాలా ఆశలు పెట్టుకున్నాయి. ఇక పట్టు వస్త్రాలు, డిజైనర్‌ దుస్తులు,  వెండి బంగారు, ఇతర ఆభరణాలు, పాదరక్షలు తదితర వ్యాపారాలు సీజన్‌కు తగ్గట్టుగా ఫుల్‌గా ప్రిపేర్‌ అయిపోయాయి. కానీ తాజా పరిస్థితులు సంబంధిత వ్యాపారాలను దెబ్బతీయనుందనే ఆందోళన వ్యక్తమవుతోంది.  

పెరుగుతున్న ఒమిక్రాన్‌ కేసుల ఉధృతి,  ఫిబ్రవరి నాటికి కరోనా థర్డ్‌ వేవ్‌ పీక్‌ స్టేజ్‌కు చేరుకుంటుందన్న నిపుణుల హెచ్చరికలతో పెళ్లిళ్ల వాయిదాకు లేదా,  సాధ్యమైనంత తక్కువ మందితో ఆ వివాహ తంతును ముగించేందుకు జనం సిద్ధపడుతున్నారు. ఈ మేరకు తమ ఇప్పటికే  క్యాన్సిలేషన్‌ ఆర్డర్లు చాలా వచ్చాయని వెడ్డింగ్ ప్లానర్లు తెలిపారు. ఈ సీజన్‌లో వెడ్డింగ్‌ బిజినెస్‌ నాలుగు లక్షల కోట్ల రూపాయల నుంచి 1.5 లక్షల కోట్లకు తగ్గే అవకాశం ఉందని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆలిండియా ట్రేడర్స్  సెక్రటరీ జనరల్ ప్రవీణ్ ఖండేల్వాల్   పేర్కొన్నారు. ఈ సారి సీజన్‌ బావుంటుందని భావించాం కానీ,  పరిస్థితి మళ్లీ మొదటి కొచ్చింది, జనవరిపై ఆశల్లేవు అంటూ ఫెర్న్స్ అండ్‌ పెటల్స్ ఎండీ, వ్యవస్థాపకుడు వికాస్ గుట్గుటియా ఆవేదన వ్యక్తం చేశారు. అయితే 2020లో నాటి తీవ్ర ప్రభావం ఉండక పోవచ్చని మాట్రిమోనీ.కాం  ఫౌండర్‌ మురుగవేల్ జానకిరామన్ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.  నిబంధనలకు అనుగుణంగా షిప్ట్‌ వెడ్డింగ్స్‌పై జంటలు మొగ్గు చూపే అవకాశం ఉందన్నారు. పెళ్లిళ్లను వాయిదా వేయకుండా, వేదిక మార్చుకోవడమో, బ్యాచ్‌ల వారీగా అతిథులను అనుమతించి వేడుకను ముగించుకొని, ఆ తరువాత గ్రాండ్‌గా రిసెప్షన్‌ ఇచ్చుకునే అవకాశముందని నమ్ముతున్నామన వెడ్డింగ్‌వైర్ ఇండియా అసోసియేట్ డైరెక్టర్-మార్కెటింగ్ అనమ్ జుబైర్ అన్నారు.

కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌తో  ప్రపంచదేశాలు వణికిపోతున్నాయి. దేశంలో ఓ వైపు డెల్టా, మరోవైపు ఒమిక్రాన్ వేరియంట్  కేసుల సంఖ్య 1,892కు చేరుకుంది.దీంతో కేసులు లోడ్‌ ఎక్కువగా ఉన్న మహారాష్ట్ర , పశ్చిమ బెంగాల్ వివాహాలకు వచ్చే అతిథుల సంఖ్యను 50కి పరిమితం చేయగా, రాజస్థాన్‌లో ఇది 100గా ఉంది. ఢిల్లీలో 20 మంది అతిథులకు మాత్రమే అనుమతి. రాబోయే రోజుల్లో  మరిన్ని ఆంక్షలు అమల్లోకి  వస్తే ఈ సీజన్‌ వ్యాపారంపై ప్రభావం భారీగాపడే అవకాశముందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

మరిన్ని వార్తలు