ఒక్క రోజులో రూ.48 లక్షలు

13 Mar, 2021 04:27 IST|Sakshi

మాస్కులు ధరించని వారి నుంచి జరిమానా వసూలు చేసిన బీఎంసీ 

స్పెషల్‌ డ్రైవ్‌లో పాల్గొంటున్న రైల్వే, నగర పోలీసులు 

సాక్షి, ముంబై: రాష్ట్రంలో రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతున్నా ప్రజలు మాత్రం నిర్లక్ష్యం వీడటం లేదు. మాస్కులు ధరించాలని, సామాజిక దూరం పాటించాలని ఎంత మొత్తుకుంటున్నా వినిపించుకోవడం లేదు. ఈ క్రమంలో మాస్కులు ధరించని వారి నుంచి జరిమానాలు వసూలు చేస్తున్న మార్పు కనిపించడం లేదు. మాస్కులు ధరించడంలో నిర్లక్ష్యం వహిస్తున్న వారిపై దాడులు ముమ్మరం చేశారు. దీంతో గత గురువారం ఒక్కరోజే జరిమానా రూపంలో రూ.48 లక్షలు వసూలయ్యాయి. ఆ రోజు ఉదయం నుంచి రాత్రి వరకు చేపట్టిన తనఖీల్లో మాస్కులు లేకుండా తిరుగుతున్న 24,226 మంది నుంచి రూ.48.45 లక్షలు జరిమానా రూపంలో వసూలు చేశారు.

మాస్క్‌ లేకుండా తిరుగుతున్న వారిపై చర్యలు తీసుకునే అధికారం బీఎంసీ కమిషనర్‌ ఇక్బాల్‌సింగ్‌ చహల్‌ గత వారం నగర పోలీసులకు ఇచ్చారు. దీంతో గురువారం పట్టుబడిన వారిలో 8,674 మందిపై నగర పోలీసులు చర్యలు తీసుకున్నారు. కరోనా కేసులు పెరిగిపోవడాన్ని బీఎంసీ, ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. దీంతో ఇటు పోలీసులకు, అటు బీఎంసీ సిబ్బందికి ప్రతీరోజు 20 వేల మందిని పట్టుకోవాలని టార్గెట్‌ విధించింది. దీంతో నగర పోలీసులు శాంతి, భద్రతలను పరిరక్షిస్తూనే మాస్క్‌ లేకుండా తిరుగుతున్న వారిపై దృష్టి సారిస్తున్నారు. మరోపక్క బీఎంసీ అధికారులు, సిబ్బందితోపాటు క్లీన్‌ అప్‌ మార్షల్స్‌ కూడా బృందాలుగా ఏర్పడి దాడులు చేస్తున్నారు. ఇందులో పెద్ద సంఖ్యలో మాస్క్‌ లేకుండా తిరుగుతున్న జనాలు పట్టుబడుతున్నారు.  చదవండి: (కరోనా విజృంభణ.. మార్చి 31 వరకు స్కూల్స్‌ బంద్!‌)

343 రోజులు.. రూ.37.27 కోట్లు.. 
మాస్కులు లేకుండా తిరుగుతున్న వారి నుంచే కరోనా వేగంగా వ్యాపిస్తుందని గుర్తించిన బీఎంసీ ఆ మేరకు చర్యలకు ఉపక్రమించింది. ఇందులో భాగంగా మాస్క్‌ లేకుండా తిరుగుతున్న వారిపై 2020 ఏప్రిల్‌ 20వ తేదీ నుంచి చర్యలు తీసుకోవడం ప్రారంభించింది. ఇప్పటి వరకు మొత్తం 343 రోజుల్లో 18,45,777 మందిపై చర్యలు తీసుకుంది. వీరి నుంచి రూ.37,27,45,600 జరిమానా వసూ లు చేసినట్లు బీఎంసీ వర్గాలు తెలిపాయి.

ఇదిలా ఉండగా బీఎంసీ సిబ్బంది, క్లీన్‌ అప్‌ మార్షల్స్, నగర పోలీసులతో పాటు ముంబై లోకల్‌ రైల్వే పోలీసులు కూడా చురుగ్గా విధులు నిర్వహిస్తున్నారు. లోకల్‌ రైళ్లలో మాస్క్‌ లేకుండా ప్రయాణిస్తున్న వారిపై చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు 8,636 మందిని పట్టుకుని వారి నుంచి రూ.17.27 లక్షలు జరిమానా వసూలు చేశారు. నగర పోలీసులు 1,12,226 పట్టుకుని వారి నుంచి రూ.2,12,5,200 వసూలు చేశారు. వర్లీ, పరేల్, దాదర్, మాటుంగా, ధారావీ తదితర ప్రాంతాల్లో మాస్క్‌ లేకుండా తిరుగుతున్న 3,03,025 మంది నుంచి రూ.6,63,34,400 జరిమానా వసూలు చేశారు.   చదవండి: (వారం రోజులు లాక్‌డౌన్‌.. తెరచి ఉంచేవివే..)

మరిన్ని వార్తలు