చెన్నైలో 21.5 శాతం మందికి కోవిడ్‌-19

1 Sep, 2020 20:30 IST|Sakshi

సెరో సర్వేలో వెల్లడి

చెన్నై : జనాభా ఆధారంగా వైరస్‌ సంక్రమణను పసిగట్టేందుకు చేపట్టే సెరలాజికల్‌ సర్వేలో కీలక వివరాలు వెలుగుచూస్తున్నాయి. చెన్నైలో ఇప్పటికే ప్రతి ఐదుగురిలో ఒకరు కరోనా వైరస్‌ బారినపడినట్టు వెల్లడైంది. ఇన్ఫెక్షన్ల వ్యాప్తిని పసిగట్టేందుకు దేశవ్యాప్తంగా కోవిడ్‌ సెరో సర్వేలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇక చెన్నై జనాభాలో 21.5 శాతం మంది ఇప్పటికే కోవిడ్‌-19 బారినపడగా నగర జనాభాలో 80 శాతం మంది వైరస్‌ సోకే అనుమానిత జాబితాలో ఉన్నట్టు సర్వే తెలిపింది. నగరంలోని వివిధ జోన్లలో వ్యాధి సంక్రమణ వివిధ స్ధాయిల్లో ఉందని పేర్కొంది. చెన్నైలో 15 జోన్లకు చెందిన 51 వార్డుల్లో 12,405 రక్త నమూనాలను సేకరించి పరీక్షించగా 2673 మందికి గతంలో కోవిడ్‌-19 సోకిందని సర్వే గుర్తించింది.

కరోనా వైరస్‌ను ఎదుర్కొనే యాంటీ బాడీలను గుర్తించేందుకు వ్యక్తుల రక్త నమూనాలను సెరో సర్వేలో పరీక్షిస్తారు. కోవిడ్‌-19 సంక్రమణను గుర్తించేందుకు దేశవ్యాప్తంగా పలు నగరాల్లో సెరో సర్వేలు నిర్వహిస్తున్న క్రమంలో చెన్నైలో చేపట్టిన సర్వేలో ఈ వివరాలు వెలుగుచూశాయి. ఢిల్లీలో ఇప్పటికే పలుమార్లు సెరో సర్వేలను నిర్వహించగా తాజాగా మంగళవారం ప్రారంభమైన సర్వేలో 17,000 శాంపిళ్లను పరీక్షించనున్నారు. ఇక దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 69,921 తాజా పాజిటివ్‌ కేసులు నమోదడంతో మొత్తం కేసుల సంఖ్య 36,91,167 కు చేరింది. వైరస్‌ బాధితుల్లో తాజాగా 819 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 65,288కి పెరిగింది.

చదవండి : ఆసియాలోనే తొలిసారిగా కోవిడ్‌ పేషెంట్‌కు..

మరిన్ని వార్తలు