ఘాటెక్కిన ఉల్లి.. కిలో @110

21 Oct, 2020 06:43 IST|Sakshi

తగ్గిన దిగుమతి 

ఈజిప్ట్‌ నుంచి 27 టన్నులు రాక 

సాక్షి, చెన్నై: మార్కెట్లో ఉల్లి మళ్లీ కన్నీళ్లు పెట్టిస్తోంది. దిగుమతి తగ్గడంతో అమాంతంగా రేటు పెరిగింది. మంగళవారం కిలో ఉల్లి రూ.110 పలికింది. ఈ ధర మరింత పెరిగే అవకాశాలు ఉన్నట్టు వ్యాపారులు పేర్కొంటున్నారు. రాష్ట్రానికి ఎక్కువగా కర్ణాటక, మహారాష్ట్ర నుంచి ఉల్లి దిగుమతి అవుతుంది. అతిపెద్ద సైజు కల్గిన ఉల్లిపై రెండు రాష్ట్రాల నుంచి, చిన్న సైజు రకం ఆంధ్రా నుంచి ఇక్కడికి సరఫరా అవుతుంటాయి.

కొద్ది రోజులుగా వర్షాలు మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రా, తెలంగాణలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుండడంతో ఉల్లి సరఫరా ఆగింది. దిగుమతి ఆగడంతో మంగళవారం ఉల్లి ఘాటెక్కింది. మున్ముందు ధర అమాంతంగా పెరుగుతూ కన్నీళ్లు పెట్టించే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. చెన్నైలో అతి పెద్ద మార్కెట్‌గా ఉన్న కోయంబేడుకు రోజుకు 150 లారీలు రావాల్సి ఉండగా తాజాగా 50 లారీలు మాత్రమే వచ్చాయి. దీంతో ధర అమాంతంగా పెరిగింది. 

కిలో రూ.100కు పై మాటే.. 
రాష్ట్రంలో ఉల్లి కొన్ని చోట్ల రూ.100, రూ.110 అంటూ ధర పలికింది. ఉల్లి ఘాటు మరింతగా పెరగనున్న నేపథ్యంలో పాలకులు స్పందించారు. ప్రభుత్వ తోట పచ్చదనం దుకాణాల ద్వారా ఉల్లిని తక్కువ ధరకు అందించేందుకు సిద్ధమయ్యారు. అలాగే డిమాండ్‌కు తగ్గ ఉల్లిని దిగుమతి చేయించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ప్రధానంగా ప్రజల్ని ఉల్లి ఘాటు నుంచి గట్టెక్కించేందుకు ‘తోట, పచ్చదనం, వినియోగదారుల దుకాణం’ల ద్వారా కిలో రూ.45కు పంపిణీ చేయడానికి చర్యలు తీసుకున్నామని సహకార మంత్రి సెల్లూరు కే రాజు తెలిపారు.

అలాగే పెరుగుతున్న ఉల్లి ధరను పరిగణించి రాష్ట్ర ప్రభుత్వం నేరుగా ఉల్లి కొనుగోలు చేసి, ప్రజలకు తమ పరిధిలోని దుకాణాల ద్వారా అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలి పారు.  ఎవరైనా టోకు వర్తకులు ఉల్లి నిల్వ ఉంచుకుని ఉంటే, చర్యలు తప్పవని హెచ్చరించారు. మంగళవారం సాయంత్రం ఈజిప్టు ఉల్లి 27 టన్నులు కోయంబేడుకు వచ్చి చేరడం కాస్త ఊరట.  

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు