సిరాలో తప్ప చట్టాల్లో నలుపు ఎక్కడ?

21 Nov, 2021 06:00 IST|Sakshi

రైతు సంఘ నేతల్ని ప్రశ్నించిన కేంద్ర మంత్రి వీకే సింగ్‌

బస్తి(ఉత్తరప్రదేశ్‌): వ్యవసాయ చట్టాలను రాయడానికి వినియోగించిన సిరా మాత్రమే నలుపు అని, చట్టాల్లో ‘నలుపు’ ఎక్కడ ఉందని కేంద్ర మంత్రి వి.కె.సింగ్‌ రైతు సంఘాల నాయకుల్ని ప్రశ్నించారు. చిన్న, సన్నకారు రైతుల ప్రయోజనాలను ఈ నాయకులు పట్టించుకోరా? అని నిలదీశారు. వివాదాస్పద సాగు చట్టాల రద్దు నిర్ణయాన్ని ప్రకటించి ప్రధాని మోదీ జాతికి క్షమాపణలు చెప్పిన మర్నాడు శనివారం కేంద్ర విమానాయాన శాఖ సహాయ మంత్రి వి.కె. సింగ్‌ విలేకరుల సమావేశంలో రైతు సంఘాలను తీవ్ర స్థాయిలో తప్పుబట్టారు. ఇటీవల ఒక రైతు సంఘం నాయకుడితో తాను జరిపిన సంభాషణని ఆయన గుర్తు చేసుకున్నారు. ‘ఒక్కోసారి మనం విషయాలన్నీ ఎంతో బాగా అర్థం చేసుకుంటాం. కానీ వేరేవరో ఏదో చెప్పగానే గుడ్డిగా వారిని అనుసరిస్తాం. నన్ను కలిసిన ఒక రైతు సంఘం నాయకుడిని నేను ఇదే విషయాన్ని అడిగాను. చట్టాల్ని లిఖించడానికి వాడిన సిరాలో తప్ప నలుపు ఎక్కడ ఉందని సూటిగా ప్రశ్నించాను’’ అని వీకే సింగ్‌ అన్నారు.

మరిన్ని వార్తలు