అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం

28 Nov, 2020 09:20 IST|Sakshi

పట్నా : బిహార్ అసెంబ్లీ‌ ఎన్నికల్లో విజయాన్ని సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఎన్డీయేపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాయి. కొత్త ప్రభుత్వం ఏర్పాటు అనంతరం జరిగిన తొలి అసెంబ్లీ సమావేశాల్లో అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం సాగింది. ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ను టార్గెట్‌గా చేసుకున్న ప్రతిపక్ష నేత తేజస్వీ యాదవ్‌.. విమర్శల వర్షం కురిపించారు. ఎన్నికల్లో అవకతవకలు జరిపి అధికారంలోకి వచ్చారని ఆరోపించారు. ఎన్డీయే కూటమి తమకంటే కేవలం 12,270 ఓట్లు, 16 సీట్లు మాత్రమే సాధించి అధికారంలోకి వచ్చిందని అన్నారు.

తేజస్వీ విమర్శలకు సీఎం నితీష్‌ కుమార్‌ ఘాటుగా స్పందించారు. తొలిసారి సభలో ఎన్నడూ లేని ఆగ్రహాన్ని ప్రదర్శించారు. జీవితంలో అభివృద్ధి చెందాలంటే ముందు ‍ప్రవర్తన మార్చుకోవాలని, గౌరవాన్ని కాపాడుకోవాలని చురకలు అంటించారు. ఒక ఓటు తేడా కూడా విజయాన్ని నిర్ణయిస్తుందని బదులిచ్చారు. ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని ఎవరైనా అనుకుంటే వారు కోర్టును ఆశ్రయించవచ్చు సూచించారు. 122 సీట్లు సాధించిన ఎవరైనా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చుని పేర్కొన్నారు. కాగా ఉత్కంఠ బరితంగా సారిగి బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి విజయం సాధించిన విషయం తెలిసిందే. 110 స్థానాల్లో పోటీ చేసిన బీజేపీ 74, 115 స్థానాల్లో పోటీ చేసిన నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీ(యు) 43 సీట్లలో గెలిచి అధికారాన్ని అందుకున్నాయి. 

సింగిల్‌ లార్జెస్ట్‌ పార్టీ
రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) నేతృత్వంలోని ప్రతిపక్ష కూటమి, కాంగ్రెస్, వామపక్ష పార్టీలతో 110 అసెంబ్లీ స్థానాలను దక్కించుకోగలిగింది. ఈ ఎన్నికల్లో ఆర్జేడీ మాత్రమే ఎన్డీఏకు గట్టి పోటీ ఇచ్చింది. అసెంబ్లీ ఎన్నికల్లో 75 సీట్లు సాధించి అసెంబ్లీలో అతిపెద్ద పార్టీగా అవతరించింది. కాంగ్రెస్ చేసిన పేలవమైన ప్రదర్శన కారణంగా మహాకూటమి అధికారంలోకి రాలేకపోయిందని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే  అధికారంలో ఉన్న జేడీయు కూడా పేలవమైన ప్రదర్శనతో మూడవ స్థానం సరిపెట్టుకుంది.

మరిన్ని వార్తలు