అవిశ్వాస తీర్మానానికి నోటీసు ఇచ్చిన 12 పార్టీలు

20 Sep, 2020 16:29 IST|Sakshi

వ్యవసాయ బిల్లులపై రగడ

సాక్షి, న్యూఢిల్లీ : రాజ్యసభలో విపక్షాల ఆందోళన మధ్య వ్యవసాయ బిల్లులకు ఆమోదం లభించిన నేపథ్యంలో పెద్దల సభలో రేగిన దుమారం కొనసాగుతోంది. విపక్ష పార్టీలు రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌ హరివంశ్‌ నారాయణ్‌ సింగ్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాయి. హరివంశ్‌పై అవిశ్వాస తీర్మానానికి ఆదివారం 12 విపక్ష పార్టీలు నోటీసు ఇచ్చాయి. ప్రజాస్వామిక విలువలను, సంప్రదాయాలను పరిరక్షించాల్సిన హరివంశ్‌ ప్రజాస్వామిక విలువలకు తూట్లుపొడిచారాని, ఆయనకు వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని తాము నిర్ణయించామని రాజ్యసభ ఎంపీ, కాంగ్రెస్‌ నేత అహ్మద్‌ పటేల్‌ వెల్లడించారు.

విపక్షాల ఆందోళనలను విస్మరిస్తూ రైతు వ్యతిరేక వ్యవసాయ బిల్లులను ఆమోదించడం ద్వారా పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని ప్రభుత్వం ఖూనీ చేసిందని తృణమూల్‌ ఎంపీ డెరెక్‌ ఓబ్రెన్‌ ఆరోపించారు.విపక్ష ఆందోళనలను కప్పిపుచ్చేందుకు ప్రత్యక్ష ప్రసారాన్ని నిలిపివేసి ప్రభుత్వం​ బిల్లులను ఆమోదింపచేసుకుందని విమర్శించారు. ఇక గురువారం లోక్‌సభ ఆమోదించిన వ్యవసాయ బిల్లులను విపక్షాల ఆందోళన మధ్య ఆదివారం రాజ్యసభ ఆమోదించింది.

మరిన్ని వార్తలు