Time Travel: కాలంలో ప్రయాణం సాధ్యమేనా?

2 May, 2022 05:06 IST|Sakshi

అవకాశముందంటున్న సైంటిస్టులు 

మల్టిపుల్‌ టైమ్‌ లైన్స్‌కు అవకాశం 

టైమ్‌ ట్రావెల్‌ అసాధ్యమేమీ కాదు. అదో ఇంజనీరింగ్‌ సమస్య. అంతే!
– ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త మైకియో కాకు

చేజారితే మళ్లీ దొరకనిది కాలమని అందరికీ తెలుసు. కానీ టైమ్‌ ట్రావెలే గనక నిజంగా సాధ్యమైతే? చేజారిన క్షణాలను మళ్లీ చవిచూడవచ్చు. సైన్స్‌ ఫిక్షన్‌గా, కవుల కల్పనగా భాసించిన కాల ప్రయాణం సాధ్యమేనంటున్నారు సైంటిస్టులు! 

గతంలో చేసిన పొరపాట్లు సరిదిద్దుకోవడానికి అవకాశం వస్తే బాగుండని అనుకోని వాళ్లుండరు. కానీ నిజజీవితంలో అది సాధ్యమయ్యేది కాదని అందరికీ తెలుసు. అయితే ఇంతవరకు మనిషి కల్పనలో భాగమైన టైమ్‌ మిషన్‌ ఇక ఎంతమాత్రం కల్పన కాదని పరిశోధకులు చెబుతున్నారు. ఇకపై ఎవరైనా కాలంలో వెనక్కు పయనించవచ్చంటున్నారు. ‘ఆహా! ఎంత శుభవార్త’అనుకుంటున్నారా? ఒక్క నిమిషం ఆగండి. కాలంలో వెనక్కు పయనించడం సాధ్యమే కానీ అది ఏ టైమ్‌లైన్‌లోకి అన్నది మాత్రం ఎవరూ చెప్పలేరని వివరిస్తున్నారు. కాస్త కన్ఫ్యూజింగ్‌గా ఉంది కదా! ఈ కన్ఫ్యూజన్‌ పోవాలంటే ఐన్‌స్టీన్‌ స్పేస్‌ అండ్‌ టైమ్‌ సూత్రం నుంచి కొత్త సిద్ధాంతం వరకు గుర్తు చేసుకోవాలి. 

రెండు సమస్యలు 
ఐన్‌స్టీన్‌ ప్రకారం స్థలకాలాదులు వాస్తవాలు కావు. అవి సాపేక్షాలు. అసలు ఆ రెండూ కలిసి స్పేస్‌టైమ్‌గా కూడా ఉంటాయి. ఈ సిద్ధాంతం ఆధారంగా పలువురు సైంటిస్టులు కాల ప్రయాణానికి సంబంధించిన సూత్రాలు రూపొందించారు. కానీ ఆచరణలో ఇవన్నీ విఫలమయ్యాయి. సూత్రాల వైఫల్యానికి ముఖ్యంగా రెండు కారణాలున్నాయి. టైమ్‌ మిషన్‌ నిర్మించడానికి నెగిటివ్‌ ఎనర్జీ (డార్క్‌ మ్యాటర్‌) కావాలి. కానీ మన చుట్టూ ఉన్న ప్రతిదీ పాజిటివ్‌ ఎనర్జీతో తయారైనదే. అలాంటప్పుడు టైమ్‌ మిషన్‌ కోసం నెగిటివ్‌ ఎనర్జీని ఎలా తీసుకురావాలన్నది మొదటి ప్రశ్న. క్వాంటమ్‌ సిద్ధాంతం ప్రకారం నెగిటివ్‌ మ్యాటర్‌ను స్వల్పకాలం పాటు స్వల్ప పరిమాణంలో సృష్టించవచ్చు.

కాలంలో ప్రయాణానికి అసలు సమస్య టైమ్‌ కన్సిస్టెన్సీ పారడాక్స్‌ (కాల స్థిరత్వ విరోధాభాసం). అంటే భూతకాలంలో ఒక సంఘటనలో మార్పు వస్తే దాని ప్రభావం వర్తమానంపై కూడా పడుతుంది. అదే సమయంలో వర్తమానంలో అప్పటికే వచ్చిన మార్పు భూతకాలం తాలూకు సదరు మార్పును జరగనీయకుండా ఆపుతుంది. మరింత సరళంగా చెప్పాలంటే మీరు టైమ్‌ మిషన్‌లో ఐదు నిమిషాలు వెనక్కువెళ్లి అక్కడ అదే టైమ్‌ మిషన్‌ను ధ్వంసం చేశారనుకోండి, అలాంటప్పుడు మీకు ఐదు నిమిషాల తర్వాత టైమ్‌ మిషన్‌ వాడే అవకాశమే ఉండదు. అలా టైమ్‌ మిషన్‌ వాడే అవకాశమే లేనప్పుడు మీరు ఐదు నిమిషాల గతంలోకే వెళ్లలేరు. దాన్ని ధ్వంసం చేయనూ లేరు. అంటే ఏకకాలంలో టైమ్‌ మిషన్‌ ఉంటుంది, ఉండదు కూడా. ఇదే కాల ప్రయాణంలో ఎదురయ్యే రెండో పరస్పర విరుద్ధ వాస్తవాల సమస్య.     
– నేషనల్‌ డెస్క్, సాక్షి   

పరిష్కారాలున్నాయి 
రకరకాల పారడాక్స్‌ల దృష్ట్యా కాల ప్రయాణం అసాధ్యమనే నిర్ణయానికి వచ్చారు ప్రముఖ సైంటిస్టు స్టీఫెన్‌ హాకింగ్‌. టైమ్‌ ట్రావెల్‌ నిజమైతే ఈపాటికి భవిష్యత్‌ మానవులు మన దగ్గరికి వచ్చేవారన్నది ఆయన అభిప్రాయం. కానీ వీటన్నింటికీ సరికొత్త సమాధానం ఉందంటున్నారు ప్రస్తుత పరిశోధకులు. ఐగార్‌ డిమిట్రివిక్‌ నొవికో అనే సైంటిస్టు ప్రకారం మనం భూతకాలంలోకి వెళ్లవచ్చు, కానీ అక్కడ ఎలాంటి మార్పులూ చేయలేం! అంటే భూతకాలంలో ప్రేక్షకులుగా మాత్రమే ఉండగలుగుతాం. అలాంటప్పుడు పారడాక్స్‌ల సమస్యే రాదు. అయితే పారడాక్స్‌ సమస్యకు అతి ముఖ్య పరిష్కారం మల్టిపుల్‌ హిస్టరీలు లేదా మల్టిపుల్‌ టైమ్‌లైన్స్‌ అంటారు నవీన శాస్త్రవేత్తలు. దీని ప్రకారం భూతకాలంలోకి వెళ్లవచ్చు. మార్పులూ చేయవచ్చు. కానీ ఆ మార్పులు ప్రస్తుత టైమ్‌లైన్‌లో ప్రతిబింబించవు.

మీరు చేసిన మార్పులతో కొత్త టైమ్‌లైన్‌ స్టార్టవుతుంది. అంటే ఒక ఘటనకు అనేక చరిత్రలుంటాయి. ఈ సిద్ధాంతాన్ని పై ఉదాహరణకు అన్వయిస్తే మీరు ఐదునిమిషాల గతంలోకి వెళ్లేది మీ ప్రస్తుత టైమ్‌లైన్‌లోకి కాదు. అది మరో కొత్త టైమ్‌లైన్‌. అక్కడ మీరు టైమ్‌ మిషన్‌ ధ్వంసం చేసిన తర్వాతి పరిణామాలతో టైమ్‌లైన్‌ కొనసాగుతుంది. అంటే మీ ఐదు నిమిషాల భూతకాల ప్రయాణం తర్వాత మీకు రెండు చరిత్రలుంటాయి. ఒకటి ప్రస్తుతమున్నది, మరోటి మీరు సృష్టించినది. అయితే మన విశ్వంలో ఇలా అనేక టైమ్‌లైన్స్‌ ఉండటం సాధ్యమేనా? అంటే క్వాంటమ్‌ సిద్ధాంతం ప్రకారం అవకాశం ఉందంటున్నారు సైంటిస్టులు. 

ఫైనల్‌గా... ‘టైమ్‌ ట్రావెల్‌ సాధ్యమే. కానీ దీనివల్ల టైమ్‌లైన్స్‌ మారతాయి’అన్నది ప్రస్తుత సైంటిస్టుల సిద్ధాంతం. ఇది ప్రాక్టికల్‌గా నిరూపితమవ్వాలంటే ఒక రియల్‌ టైమ్‌ మిషన్‌ నిర్మాణం జరగాలి. అంతవరకు ఈ సిద్ధాంత రాద్ధాంతాలు నడుస్తూనే ఉంటాయి.   

మరిన్ని వార్తలు